ట్రంప్‌ ఆదేశాలతోనే దాడి : వైట్‌ హౌస్‌

3 Jan, 2020 09:50 IST|Sakshi

వాషింగ్టన్‌ : బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్‌ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సులేమానీని హతమార్చినట్టు ఆ దేశ రక్షణ విభాగం(పెంటగాన్‌) వెల్లడించింది. ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్‌ ఆరోపించింది. వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి సులేమానీ బాధ్యుడని తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సులేమానీ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అలాగే ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది. వైట్‌ హౌస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 

బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్‌ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్‌ ఇరాక్‌కు ప్రత్యేక బలగాలు పంపించారు. సులేమానీని మట్టుబెట్టడంతో అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, సులేమానీ సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రెండు ప్రత్యేక కాన్వాయ్‌లు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్నాయి. అయితే సులేమానీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ దాడులు జరిగాయి. 

అమెరికా జెండాను పోస్ట్‌ చేసిన ట్రంప్‌..
బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడిలో సులేమానీ మృతి చెందిన కొద్దిసేపటికే డోనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో అమెరికా జాతీయ జెండాను పోస్ట్‌ చేశాడు. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సులేమానీని మట్టుపెట్టడం ద్వారా అమెరికా విజయం సాధించిందని చెప్పడానికే ఆయన ఈ విధమైన పోస్ట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, అమెరికా జరిపిన ఈ రాకెట్‌ దాడిలో ఖాసీం సులేమానీ, ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు.

చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడి.. 8 మంది మృతి

మరిన్ని వార్తలు