భారత్‌పై నిఘా పెట్టలేదు

31 Mar, 2019 05:38 IST|Sakshi

ఏశాట్‌ ప్రయోగంపై ముందే తెలుసు

స్పష్టం చేసిన అమెరికా రక్షణశాఖ

వాషింగ్టన్‌: భారత్‌ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్‌ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్‌ ఏ–శాట్‌ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే తెలుసని అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ డేవిడ్‌.డబ్ల్యూ.ఈస్ట్‌బర్న్‌ చెప్పారు. ‘ప్రయోగం గురించి మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రయోగం కోసం నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను భారత్‌ నిషేధించింది. ఈ విషయాన్ని ముందురోజే చెప్పింది’ అని అన్నారు. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని గత గురువారం∙ఏశాట్‌ క్షిపణి కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాలకే అమెరికాకు చెందిన ‘ఆర్‌సీ–135ఎస్‌ కోబ్రా బాల్‌’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది.

మోదీపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీ
ఛండీగఢ్‌: జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రెండేళ్ల క్రితం వీడియో పోస్ట్‌ చేసి ఉద్యోగం కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ తేజ్‌బహదూర్‌ యాదవ్‌ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఒకవేళ గెలుపొందితే సాయుధ బలగాల్లో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని ఆయన శుక్రవారం చెప్పారు. అవినీతి గురించి గళం విప్పినందుకే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ 2017లో యాదవ్‌ ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టగా, క్రమశిక్షణా చర్యల కింద ఆర్మీ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు