కరోనా వైరస్‌ మృతుల సంఖ్య వేలల్లోనా!

6 Feb, 2020 17:03 IST|Sakshi

వుహాన్‌ : నేడు ప్రపంచ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వల్ల చైనాలో ఎంత మంది మరణించారనే విషయమై ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అందుకు కారణం ఎప్పటికప్పుడు వైరస్‌ వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తున్న అతి పెద్ద చైనా కంపెనీ ‘టెన్‌సెంట్‌ (చైనాలోనే రెండో పెద్ద కంపెనీ)’ తన వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు కరోనావైరస్‌ వల్ల 24,589 మంది మరణించారని, 1,54,000 మంది వ్యాధికి గురయ్యారని పేర్కొంది.  ప్రభుత్వం చెబుతున్న లెక్కలకన్నా 80 రెట్లు ఎక్కువ మంది మరణించగా, పది రెట్లు ఎక్కువ మందికి వ్యాధి సోకింది. 

చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం మృతులకు సంబంధించిన వాస్తవాలను దాచి పెడుతోందంటూ ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో టెన్‌సెంట్‌ కంపెనీ ఈ సంఖ్యను వెబ్‌సైట్‌లో పేర్కొనడం ఒక్కసారిగా ప్రజల్లో అలజడి రేపింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కరోనా వైరస్‌ వల్ల ఇప్పటి వరకు 304 మంది మరణించారని, 14,446 మందికి వ్యాధి సోకిందంటూ ప్రభుత్వ లెక్కలనే పేర్కొంది. ప్రభుత్వ లెక్కలకు, వైద్య వర్గాలు వెల్లడిస్తున్నలెక్కలకు కూడా తేడా ఉండడంతో ప్రజల్లో ఎక్కువగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనావైరస్‌ మృతుల సంఖ్య 73 నుంచి 563కు పెరిగిందని, బాధితుల సంఖ్య 3,694 నుంచి 28,018కి పెరిగిందని, మృతులు, బాధితులు వుహాన్‌ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని వైద్య వర్గాలు మంగళవారం ప్రకటించాయి. మృతులు, బాధితుల సంఖ్యను బాగా తగ్గించి చెప్పాల్సిందిగా చైనా ప్రభుత్వం నుంచి  వైద్యాధికారులపై ఎక్కువగా ఒత్తిడి వస్తోందని ‘తైవాన్‌ న్యూస్‌’ వెల్లడించింది. 
కరోనా విశ్వరూపం

కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన

>
మరిన్ని వార్తలు