తెలివి ఎక్కువైతే అసలుకే మోసం!

25 Aug, 2018 05:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తెలివైన వారిని, అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ(ఈజీ గోయింగ్‌) సరదాగా ఉండే వారిని అందరూ ఇష్ట పడతారని,అలాంటి వారినే ప్రేమికులుగా ఎన్నుకుంటారని అంతా భావిస్తుంటారు.అయితే, ఆ భావన సరికాదని తాజా అధ్యయనంలో తేలింది. మరీ ఎక్కువ తెలివితేటలు, టేకిట్‌ఈజీ మెంటాలిటీ గల వారిని భాగస్వాములుగా చేసుకోవడానికి ప్రేమికులెవరూ ఇష్టపడరని  యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.తెలివితేటలయినా, దయాగుణమైనా, అందం అయినా  ఓ స్థాయి వరకే బాగుంటుందని తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన గిలిస్‌ గిగ్నాక్‌ తెలిపారు.

సాధారణంగా తెలివితేటలు, సరదాతత్వం, దయాగుణం, అందం కలవాడు భాగస్వామిగా రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటారని పరిశోధన తేల్చిన ఫలితం. వర్సిటీ పరిశోధకులు ఈ నాలుగు అంశాలపై  వందల మంది యువతీ యువకుల అభిప్రాయాలను అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. తెలివితేటలు మరీ ఎక్కువగా ఉన్న వారు భాగస్వామిగా ఉంటే తమకు అభద్రతా భావం కలుగుతుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు. ఈజీ గోయింగ్‌ మెంటాలిటీ  ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుందని, వారికెలాంటి ఆశయాలు ఉండవని కూడా అభిప్రాయపడినట్టు గిలిస్‌ చెప్పారు.తమతో సమానమైన తెలివితేటలున్న వారినే భాగస్వాములుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలు బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకాలజీలో ప్రచురితమయ్యాయి.
           
 

మరిన్ని వార్తలు