ఇంట్లోనే వైరస్‌ ముప్పు

23 Jul, 2020 01:58 IST|Sakshi

కుటుంబ సభ్యులకే ఒకరి నుంచి మరొకరికి

దక్షిణ కొరియా అధ్యయనంలో వెల్లడి

సియోల్‌: ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్‌ సోకడం అధికంగా జరుగుతోందని దక్షిణ కొరియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వైరస్‌ సోకిన ప్రతీ 10 మందిలో ఒకరికి కుటుంబ సభ్యుల నుంచి సోకినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ఫలితాలను అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రచురించింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 5,706 మంది రోగులపై అధ్యయనం చేస్తే వారి ద్వారా 59 వేల మందికి వైరస్‌ సోకినట్టు తేలింది.

ప్రతీ 100 మంది కోవిడ్‌ రోగుల్లో ఇద్దరికి వేరే కారణాల ద్వారా వైరస్‌ సోకినట్టు ఆ సర్వే వెల్లడించింది. కుటుంబ సభ్యుల ద్వారా వైరస్‌ సోకిన వారిలో అత్యధికులు టీనేజ్‌లో ఉన్నవారు లేదంటే 60–70 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారని తేలింది. ఇక తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వైరస్‌ సోకడం అత్యంత అరుదుగా జరిగిందని ఈ అ«ధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్లలో ఒకరైన డాక్టర్‌ చో యంగ్‌జూన్‌ తెలిపారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ఉధృతి అత్యధికంగా ఉన్న జనవరి 20, మార్చి 27 మధ్య సర్వేని నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు