చావుకి మేం భయపడం.. ఎందుకంటే దానికి మేమం‍టే..

7 Jul, 2018 11:01 IST|Sakshi

చావును పొమ్మంటూ తన్ని తరిమేశారు..

ప్రమాదం ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. విమానంలో వెళుతున్నప్పడు అది అనుకోకుండా కూలిపోవచ్చు , నడిసంద్రంలో నావ తలకిందులవ్వొచ్చు , లేకపోతే క్రూర జంతువులున్న దట్టమైన అడవిలో దారి తప్పిపోవచ్చు. అయితే, ఇలాంటి సందర్భాల్లోనూ కొందరు మృత్యువును జయిస్తారు. ప్రాణాలతో బయటపడతారు. థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లైన 12 మంది చిన్నారులు, వారి కోచ్‌ ఓ గుహలో చిక్కుకొని పదిరోజులు పైనే అయ్యింది. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ.. ఇలాంటి కొన్ని ప్రమాదాల్లో చిక్కుకొని క్షేమంగా బయటపడిన కొందరు మృత్యుంజయుల గురించి తెలుసుకుందాం...

విమానం నుంచి దట్టమైన అడవిలో పడి.. 
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో 1971 డిసెంబర్‌లో జరిగింది ఈ సంఘటన. ఇక్కడి రాజధాని నగరం లిమాలోని ఓ వర్సిటీలో చదువుతున్న జులియన్‌ మార్గరెట్‌ కోపెకె(17).. జర్మనీలో ఉన్న తన తండ్రిని కలిసేందుకు తల్లి మారియా కోపెక్‌తో కలసి ఓ చిన్నవిమానంలో బయల్దేరింది. మరో 10 మంది ప్రయాణికులు వారికి తోడుగా ఉన్నారు. ఆకాశంలో దాదాపు 2 మైళ్ల ఎత్తులో వెళుతుండగా హఠాత్తుగా ఓ మెరుపు విమానాన్ని తాకింది. దీంతో వెంటనే అది ముక్కలై సమీపంలోని అడవిలో కూలింది. సీటు బెల్టు పెట్టుకొని ఉన్న జులియన్‌ ఓ చెట్టు కొమ్మకు సీటుతో సహా చిక్కుకుంది. కాసేపటికి తేరుకుని వెంటనే కిందకు దిగి తల్లికోసం చుట్టుపక్కల వెతికింది. అప్పటికే తల్లితోపాటు మిగిలిన ప్రయాణికులూ మృతిచెందడాన్ని గుర్తించింది. వెంటనే అడవి నుంచి బయటపడేందుకు మార్గం వెతుకుతూ బయల్దేరింది. బయాలజీ విద్యార్థిని అయిన జులియన్‌.. అడవిలోని క్రూరజంతువుల నుంచి బయటపడుతూ అక్కడక్కడా దొరికే పండ్లు తిని, నీళ్లు తాగుతూ తొమ్మిది రోజుల తర్వాత చివరకు ఓ నది ఒడ్డుకు చేరుకుంది. అక్కడ బోటులో ఉన్న కొంతమంది ఆమెను గమనించి తిరిగి ఇంటికి చేర్చారు.  


సముద్రంలో ఒంటరిగా 76 రోజులు!  
అమెరికాకు చెందిన స్టీవెన్‌ కల్హాన్‌ రచయిత, ఫిలాసఫర్, జర్నలిస్ట్, పరిశోధకుడు. నేవల్‌ ఆర్కిటెక్చర్‌ చదివిన కల్హాన్‌ పడవల తయారీలో నిపుణుడు. 1986లో స్పెయిన్‌లో తీరంలో జరిగిన పడవల పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరాడు. అక్కడ పోటీలు జరుగుతుండగా తుపానులో చిక్కుకొని బోటు దెబ్బతిని ఆఫ్రికాలోని మొరాకోకు దగ్గరలో ఉన్న ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ బోటును రిపేరు చేసుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు. అప్పటికే బోటులో ఆహారం అయిపోవడంతో చేపలు, పక్షుల్ని పట్టుకొని తింటూ, వర్షాలు పడినపుడు బోటులోని ఓ డబ్బాలో నీళ్లు నిల్వచేసుకుని తాగుతూ 76 రోజుల ఒంటరి ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వెస్టిండీస్‌లోని ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ కొందరు స్థానిక జాలర్లు ఈయన్ని రక్షించడంతో తిరిగి అమెరికా చేరుకున్నాడు. సముద్రంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆ తర్వాత ఆయన రాసిన అడ్రిఫ్ట్‌ నవలకు ఎంతో పేరొచ్చింది. అలాగే 2012లో వచ్చిన లైఫ్‌ ఆఫ్‌ పై సినిమాలో కొన్ని సంఘటనలకూ స్టీవెన్‌ అనుభవమే ప్రేరణ. ఆ సినిమాకు ఆయన సహాయకుడిగానూ వ్యవహరించాడు.

127 గంటలు..!  
అమెరికాకు చెందిన రాల్‌స్టన్‌కు ట్రెక్కింగ్‌(పర్వతారోహణ) అంటే ఇష్టం. 2003లో ప్రసిద్ధ గ్రాండ్‌ కేన్యన్‌ లోయల ప్రాంతంలో ఉన్న ఓ పర్వతాన్ని అధిరోహించడానికి బయల్దేరాడు. ట్రెక్కింగ్‌ చేస్తుండగా పట్టుతప్పి రెండు పెద్ద గుండ్ల మధ్య పడ్డాడు. అతని కుడి చేయి రెండు గుండ్ల మధ్య ఉన్న ఓ చిన్న సందులో ఇరుక్కుపోయింది. దీంతో ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాడు. కొండ ప్రాంతం కావడంతో జనసంచారమూ లేదు. దీంతో రక్షించమని గట్టిగా అరుస్తూ అతను వేసిన కేకలు అరణ్య రోదన అయ్యాయి. బ్యాగులో ఉన్న ఆహారం, నీళ్లు అయిపోయాయి. చివరకు తన బ్యాగులోని ఓ కత్తితో గుండ్ల మధ్య ఇరుక్కున్న చేతిని మోచేయి వరకు కత్తిరించి ఎలాగోలా అతికష్టం మీద బయటపడ్డాడు. అప్పటికే బాగా నీరసించిన అతన్ని కొంతమంది సందర్శకులు గుర్తించి క్షేమంగా ఇంటికి చేర్చారు. రాల్‌స్టన్‌ సంఘటనతోనే ఆ తర్వాత ‘127 అవర్స్‌’ అనే ఇంగ్లిష్‌ మూవీ వచ్చింది.  

తిరగబడిన బోటు కింద మూడ్రోజులు!  
ఇది నైజీరియాలో జరిగింది. తీరంలో పెద్ద ఓడల్ని లంగరు వేసేందుకు సహాయపడే టగ్‌బోట్‌లో హారిసన్‌ ఒకీనే అనే వ్యక్తి వంటవాడిగా పనిచేసేవాడు. 2013 డిసెంబర్‌ 9న తీరంలో ఆగి ఉన్న వీరి బోటును హఠాత్తుగా వచ్చిన పెద్ద అలలు సుమారు 3 కిమీ లోపలికి లాక్కెళ్లాయి. దీంతో బోటు తిరగబడింది. ఆ సమయానికి బోటులోని బాత్‌రూంలో ఉన్న ఒకీనే అక్కడే చిక్కుకుపోయాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బాత్‌రూంలోని కొద్దిపాటి ప్రాంతంలో నీటి బుడగలా ఏర్పడింది. దీంట్లో కొద్దిగా గాలి ఉండడంతో ఒకీనేకు శ్వాస అందడానికి వీలు కుదిరింది. మూడ్రోజుల తర్వాత బోటు వద్దకు చేరుకున్న సహాయకుల బృందం ఇంకా ప్రాణాలతోనే ఉన్న ఒకీనేను గుర్తించి రక్షించింది. అయితే, అప్పటికే ఆహారం, మంచినీరు లేకపోవడం, సముద్రంలోని చల్లదనం కారణంగా ఒకీనే బాగా నీరసించిపోయాడు. ఒడ్డుకు చేరాక సపర్యలతో కోరుకున్నాడు.  

ఇలాంటివే మరికొన్ని.. 
1992లో హవాయిలోని కిలౌయ అగ్నిపర్వతం వద్ద రెండు పాయలుగా ప్రవహిస్తున్న లావా మధ్యభాగంలో చిక్కుకున్న బెన్సన్‌ అనే సినిమాటోగ్రాఫర్‌ రెండు రోజుల అనంతరం క్షేమంగా బయటపడ్డాడు.  
2012లో ఆస్ట్రేలియాలోని సిడ్నీకి సమీప అడవిలో తప్పిపోయిన ఓ 18 ఏళ్ల యువకుడిని తొమ్మిది వారాల అనంతరం రక్షక బృందాలు క్షేమంగా తీసుకొచ్చాయి. అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉండే ఆ ప్రాంతంలో ఆ యువకుడు అన్ని రోజులు బతికి ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు.   
2014లో ఎల్‌సాల్వెడార్‌కు చెందిన మత్స్యకారుడు జోస్‌ సముద్రంలో దారి తప్పి 13 నెలల తర్వాత మెక్సికో 
తీరానికి చేరాడు.   

మరిన్ని వార్తలు