ధరలపైనే జనాగ్రహం! ఇరాన్ను కుదిపేస్తున్న ఉద్యమం

3 Jan, 2018 22:05 IST|Sakshi

‘‘గాజా కాదు, లెబనాన్ కాదు. ఇరాన్  కోసం నేను ప్రాణం ఇస్తా!’’ అనే నినాదంతో జనం ఇరాన్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. నిరసన ర్యాలీలతో తిరగబడిన ప్రజలపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. మంగళవారం వరకూ జరిగిన హింసలో దాదాపు 22 మంది మరణించారు. కిందటి గురువారం ఇరాన్లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు సవాలుగా మంగళవారం నుంచి సర్కారుకు అనుకూలంగా ర్యాలీలు మొదలయ్యాయి. 

స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన ప్రజాస్వామ్యం కోసం టునీసియా మొదలు ఈజిప్ట్ వరకూ అరబ్ దేశాల్లో ‘అరబ్ వసంతం’ వంటిదే ఇరానీల ఆందోళన అని  పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోంది. అయితే, దాదాపు ఎనిమిది కోట్లకు పైగా జనాభా ఉన్న ఇరాన్లో ప్రస్తుత అశాంతికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులే కారణమన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. ప్రాచీన నాగరికతకు ప్రసిద్ధిగాంచిన ఇరాన్లో ప్రభుత్వంపై ఆగ్రహించిన జనం వీధుల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు. 2009 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో దాదాపు 34 మంది మరణించారు. 

ప్రజాగ్రహానికి ఆజ్యం పోసిన డిసెంబర్10 బడ్జెట్!
అధ్యక్షుడు హసన్‌ రూహానీ కిందటి డిసెంబర్10న ప్రవేశపెట్టిన బడ్జ్ట్‌ ప్రతిపాదనలు నిత్యావసరాలతోపాటు అనేక వస్తువుల ధరలు బాగా పెంచేలా ఉండడంతో ప్రజల్లో అసంతృప్తి లేచింది. ఓ పక్క జనంపై ధరల భారం పెంచుతూనే మరో పక్క మత సంస్థలకు ఇతోదికంగా నిధుల కేటాయింపులకు బడ్జెట్‌ వీలు కల్పించింది. ముడి చమురు అమ్మకాల విషయంలోనేగాక, పశ్చిమాసియా రాజకీయాల్లో ఆధిపత్యానికి అరబ్ దిగ్గజం సౌదీఅరేబియాతో పోటీపడడం వల్ల కూడా ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. 

‘ప్రాంతీయ పెద్దన్న’ హోదా కోసం షియా ముస్లింల జనాభా ఉన్న దేశాలు, షియా పాలకులున్న రాజ్యాలకు శక్తికి మించి సాయపడడం కూడా ఇరాన్ను సంక్షోభంలోకి నెట్టింది. దేశంలో పెట్రోలు వంటి నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరుగుతుండగా ఇరాన్ విదేశాంగ విధానం ప్రజల్లో అసంతృప్తి జ్వాలలను ఎగదోస్తోంది. పాలస్తీనా గెరిల్లా రాజకీయ సంస్థ హమస్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, సిరియా అసద్ ప్రభుత్వం, యెమెన్ హౌతీలకు ఇరాన్‌ సర్కారు అడిగినంత నిధులు సమకూర్చడం ఇరానియన్లకు నచ్చడంలేదు. ఆంక్షలు, ఇతర కారణాలతో అంతర్గత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలాంటి సాయం చేయడం అనవసరమనీ, ఓ రకంగా చూస్తే ఇది దేశద్రోహంతో సమానమని ప్రజలు భావిస్తున్నారు.

నాయకుడు లేని ప్రజా ఉద్యమం!
ఇరాన్లో రాజధాని టెహరాన్ తర్వాత రెండో పెద్ద నగరం మాషాద్లో డిసెంబర్28న మొదలైన సర్కారు వ్యతిరేక నిరసన ప్రదర్శనలు దేశంలోని 27 నగరాలు, పట్టణాలకు వారంలోపే వ్యాపించాయి. ఈసారి జనాందోళన ప్రత్యేకత ఏమంటే ప్రజలు ఏ నాయకుడి పేరు ప్రస్తావించడం లేదు. ఏ సంస్థ గొడుగు కింద పోగవడం లేదు. అధ్యక్షుడు రూహానీ, అగ్ర(మత)నాయకుడు అలీ హొసేన్‌ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
 
                                     (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

మరిన్ని వార్తలు