ఇక టీవీల్లో ఎవరికి నచ్చే యాడ్స్ వారికి మాత్రమే!

30 Dec, 2015 15:50 IST|Sakshi
ఇక టీవీల్లో ఎవరికి నచ్చే యాడ్స్ వారికి మాత్రమే!

లండన్: మొన్నటి తరానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వాటిలో చూసిన ఒకటి, రెండు ఛానెళ్లే గుర్తు. నిన్నటి తరానికి కలర్ టీవీలు, వాటిలో చూసిన 30, 40 ఛానళ్లు గుర్తు. మరి అదే నేటి తరానికి వస్తే వందల ఛానళ్లే కాదు, యూట్యూబ్, నెట్‌ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, బీటీ విజన్, స్కై....ఇలా ఎన్నో చూస్తున్నారు. తరాల సంగతి పక్కనపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా టీవీల్లో కొన్ని నచ్చిన ఛానళ్ల వీక్షణకు పరిమితమవుతున్న వారి సంఖ్య సరాసరిగా యాభై శాతానికి మించిలేదు. ఇలాంటి పోటీ ప్రపంచంలో టీవీ ఛానళ్లు తమ మనుగడను కొనసాగించాలంటే వాణిజ్య ప్రకటనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకరావాల్సిందే.

 ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో టీఆర్‌పీ రేటింగ్‌ల ప్రకారం వాణిజ్య ప్రకటనలు ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ‘సెట్ టాప్’ బాక్సుల పుణ్యమా అని రేటింగ్స్‌లో కచ్చితత్వం రావడమే కాకుండా ఛానళ్లలో వచ్చే మనకిష్టమైన కార్యక్రమాన్ని ముందుగానే రికార్డు చేసుకొని కోరుకున్నప్పుడు చూసుకునే అవకాశం వచ్చింది. కానీ చూస్తున్న కార్యక్రమం మధ్యలో వచ్చే యాడ్స్ చీకాకు కలిగిస్తున్నాయి. ఛానళ్లు మనుగడ సాగించాలి కనుక యాడ్స్ ఎలాగు తప్పవు. అదే మనకు నచ్చే యాడ్స్ మాత్రమే వస్తే బాగుంటుంది కదా! మన ఇంట్లో పిల్లీ లేదు, కుక్కా లేదనుకోండీ! మరి పిల్లి, కుక్కల ఫుడ్‌కు సంబంధించిన యాడ్ మనకెందుకు? మన అభిరుచులకు తగ్గ దుస్తుల డిజైన్స్ గురించో, నగల గురించో యాడ్స్ ఇస్తే బాగుంటుందికదా! లోకోభిన్నరుచులు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న సహజంగా వస్తుంది.

నిజంగా అభిరుచులకు తగ్గ యాడ్స్‌ను వీక్షించే అవకాశం త్వరలోనే సాకారం కాబోతోన్నది. అప్పుడు మన ఇంట్లో వచ్చే యాడ్ పక్కింట్లో రాదు, అలాగే పక్కింట్లో వచ్చే యాడ్ మనకు రాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దానికి ‘డైనమిక్ యాడ్ ఇన్‌సర్షన్’ అని పేరు కూడా పెట్టారు. మన పేరు, వయస్సు, అభిరుచులు తెలుసుకోవడానికి సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి కూడా. మనం ఏ టీవీ ఛానళ్లు చూస్తున్నామో, వాటిలో ఏ కార్యక్రమాన్ని ఎంతసేపు చూస్తున్నామో సెట్‌టాప్ బాక్సులు ఇప్పటికే రికార్డు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ డేటా నేరుగా యాడ్ ఏజెన్సీలకు వెళుతుంది. వారు వారి పద్ధతిలో వీక్షకుల అభిరుచులను అంచనా వేస్తారు. ఇదో పద్ధతి.

 ప్రజల వయస్సు తదితర వివరాలతోపాటు అభిరుచులను నేరుగా  తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ప్లేయర్లు, సర్వీసులు ఉన్నాయి. దీనికోసమే ఆన్‌లైన్ ‘ఐటీవీ’ ప్లేయర్ గత నవంబర్ నెలలో ‘ఐటీవీ హబ్’గా మారింది. ఇప్పుడు ఈ హబ్ వద్ద కోటీ పాతిక లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఉన్నారు. ఇదే మాదిరిగా లండన్‌కు చెందిన ఛానెల్ 4 తన ‘40 డీ’ ఫ్లాట్ ఫామ్‌ను ‘ఆల్ 4’గా మార్చుకుంది. దీని ద్వారా అది యూజర్ల అభిరుచులను సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమస్త సమాచారాన్ని యాడ్ ఏజెన్సీలు పంచుకుంటాయి. వాటిని విశ్లేషించి వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా యాడ్స్‌ను రూపొందిస్తాయి.

వివిధ రకాల యాడ్స్‌ను వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రసారం చేయడానికి ‘డైనమిక్ యాడ్ ఇన్‌సర్షన్’ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.  ప్రజల అభిరుచులకు తగిన విధంగా ఒక్క ‘డోవ్’ సబ్బు యాడ్‌ను 25 రకాలుగా తీయగలమని యూనిలివర్ యాడ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల ఇక్కడ జరిగిన ప్రపంచ సదస్సులో వెల్లడించారు. ఈ సదస్సులో ప్రపంచ నలుమూలల నుంచి యాడ్ ఏజెన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. వారిలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ ప్రతినిధులు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు