అక్కడ కుక్క, పిల్లులకూ శ్మశానాలు

5 Apr, 2016 13:58 IST|Sakshi

బీజింగ్‌: మనం పెంచుకుంటున్న కుక్క, పిల్లి, చిలుక మరణిస్తే ఏం చేస్తాం? వాటిని తీసుకెళ్లి మున్సిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం లేదా ఇంటి వెనకాల పెరట్లో గుంత తీసి పాతేస్తాం. కానీ చైనాలో అలా చేయడం నేరం. అందుకనే అక్కడ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశానాలే వెలిశాయి. వెలుస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఒకటి బీజింగ్‌ శివారులో వెలసిన ‘బైఫూ పెట్‌ హెవెన్‌’. అది 6.7 హెక్టార్లు విస్తరించి ఉంది.

పెట్‌ హెవెన్‌లో వేలాది చెట్లను పెంచారు. చెట్టు వద్దనే పెంపుడు జంతువులను ఖననం చేయాల్సి ఉంటుంది. ఒక్కో చెట్టుకు 20వేల రూపాయల నుంచి 44 వేల రూపాయలను వసూలు చేస్తారు. తాము 2005లో ఈపెట్‌ సర్వీసును ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల చెట్లు అమ్ముడు పోయాయని, ప్రజలు దాదాపు 20వేల పెంపుడు జంతువులను ఖననం చేశారని బైఫూ పెట్‌ హెవెన్‌ వ్యవస్థాపకుడు చెన్‌ షావోచున్‌ తెలిపారు.

చైనాలో ఏటా 42.5 లక్షల పెంపుడు కుక్కలను, 20 లక్షల పిల్లులను ఖననం చేస్తున్నారని ‘డాగ్స్‌ ఫాన్స్‌’ మేగజైన్‌ వెల్లడించింది.  ఈ ఖననాల సంఖ్య ఏడాదికి 30 శాతం పెరుగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటి పెంపుడు కుక్కలను, పిల్లులు, పక్షులు, ఇతర జంతువులను కలుపుకుంటే దాదాపు పది కోట్ల జంతువులను ఖననం చేసి ఉంటారని 2014లో జరిపిన ఓ సర్వే తెలిపింది.

‘అదర్‌ సైడ్‌’ అనే మరో పెట్‌ క్రిమేషన్‌ కంపెనీ ఇటీవల చైనా నగరాల్లో విస్తరిస్తూ వస్తోంది. తాము పెంపుడు జంతువు బరువునుబట్టి చార్జీ తీసుకుంటామని, స్థానిక కరెన్సీ ప్రకారం వంద యాన్ల నుంచి వెయ్యి యాన్ల వరకు వసూలు చేస్తామని క్రిమేటర్‌ వాంగ్‌ జిలాంగ్‌ తెలిపారు. తాను ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులే కాకుండా చిలుకలు, కుందేళ్లు, తాబేళ్లను కూడా ఖననం చేశానని ఆయన అన్నారు. తమ జంతువుల శ్మశానానికి వచ్చే వారిలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండదని, ఎవరైనా బరువునుబట్టి చెల్లింపులు సమర్పించుకోవాల్సిందేనని ఆయన అన్నారు.

పెంపుడు జంతువులను పెరట్లో పాతిపెట్టినా, చెత్త కుప్పల్లో పడేసినా అంటురోగాలు వ్యాపిస్తాయనే ఉద్దేశంతో వాటిని నిషేధిస్తూ చైనా చట్టాలు తీసుకొచ్చింది. 2014లో ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి చైనా ప్రజల్లో చైతన్యం పెరిగింది. జంతువులను చిన్నపాటి జబ్బు చేసినా ఆస్పత్రికి తీసుకెళ్లే అలవాటు కూడా బాగా పెరిగింది. దేశంలో బ్యాచ్‌లర్‌ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్లుగానే పెంపుడు జంతువుల సంఖ్య కూడా పెరుగుతోందని పెకింగ్‌ యూనివర్శిటీ సోషియాలోజి ప్రొఫెసర్‌ జీ జ్యూలాన్‌ తెలిపారు. పెంపుడు జంతువుల పెరుగుతున్న అవసరాలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిధులతో మరిన్ని ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

cremation, dogs, cats, Beijing, pet heven, కుక్క, పిల్లులకు శ్మశానాలు, బీజింగ్, బైఫూ పెట్ హెవెన్

మరిన్ని వార్తలు