పెరగనున్న పెట్రోలు ధరలు

16 Sep, 2019 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలోని చమురు నిల్వలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు శనివారం దాడి చేసిన సంఘటనలో రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్‌కు రోజుకు ఐదు శాతం చొప్పున చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ చమురు మార్కెట్‌ నిపుణులు సోమవారం హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగకుండా నివారించేందుకు తక్షణమే అమెరికా దేశీయ చమురు నిల్వలను విడుదల చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు, మూడు రోజులు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగకుండా నిలబడవచ్చని, మంటల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయిన సౌదీ అరేబియా చమురు సంస్థ ఎప్పటిలోగా తమ చమురు ఉత్పత్తుల సరఫరాను పునరుద్ధరించగలదనే అంశంపై ఆధారపడి చమురు ధరలు పెరగడం, పెరగకుండా ఉండడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత సౌదీ అరేబియా చమురు సంస్థ సరఫరాపై అనిశ్చిత పరిస్థితే కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడి చమురు నిల్వల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. సౌదీపై ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇప్పటికే గుర్తించామని, వారిపై ప్రతీకార దాడి జరిపేందుకు ఆయుధాలు లోడ్‌ చేసి పెట్టుకున్నామని, సౌదీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మరుక్షణం దాడికి పాల్పడతామని ట్రంప్‌ హెచ్చరించారు.

ఇరాన్‌ ప్రోత్సాహంతో యెమెన్‌కు చెందిన హౌతి మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారని అంతర్జాతీయ వార్తలు తెలియజేస్తుండగా, ఇరాన్‌యే ఈ దాడికి పాల్పడిందని అమెరికా నేరుగా ఆరోపిస్తోంది. అంటే ఇరాన్‌పైనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తల కారణంగా కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయి)

మరిన్ని వార్తలు