అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌

29 May, 2020 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ కీలక అంశాన్ని ప్రకటించింది. 2020 అక్టోబర్ చివరి నాటికి కోవిడ్‌-19 కు వాక్సిన్‌  అందుబాటులోకి వస్తుందని నమ్ముతున్నామని వెల్లడించినట్టు  తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. సంస్థ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా వ్యాఖ్యలను ఉటంకిస్తూ  టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ విషయాన్ని నివేదించింది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే.. అక్టోబర్ చివరిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుందని ఆయన తెలిపినట్టుగా పేర్కొంది .  ఇందుకోసం జర్మన్‌  సంస్థ బయాన్‌టెక్‌తో  కలసి పనిచేస్తున్నారన్నారని  తెలిపింది.

అంతేకాకుండా, ఈ ఏడాది చివరినాటికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్లు రావడం ప్రారంభమవుతుందని ఆస్ట్రాజెనెకా అధిపతి అధినేత పాస్కల్ సోరియట్ పేర్కొన్నట్లుగా రిపోర్టు చేసింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో, ఒక టీకా తీసుకురావడానికి కృషి చేస్తోందనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 చివరి నాటికి కనీసం ఒకరు వాక్సీన్‌ తో సిద్ధంగా ఉండవచ్చని ఆశిస్తున్నారని తెలిపింది. పాస్కల్ ప్రకారం మహమ్మారిని నిలువరించడానికి సుమారు 15 మిలియన్ మోతాదులు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా ల్యాబ్‌లు ప్రాణాంతక వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నాయని  తాజా నివేదిక పేర్కొంది.  కాగా ఇప్పటివరకూ ప్రపపంచ వ్యాప్తంగా  358,000 మంది చనిపోగా,  5 మిలియన్లకు పైగా  ఈ వైరస్‌ బారిన పడ్డారు.
 

>
మరిన్ని వార్తలు