దేవుడున్నాడని నిరూపిస్తే రాజీనామా చేస్తా

7 Jul, 2018 18:49 IST|Sakshi
రొడ్రిగో డ్యూటర్ట్‌ ( ఫైల్‌ ఫోటో)

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్‌ సవాల్‌

మనీలా :  దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే దేశ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తానని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్‌ సవాలు విసిరారు. స్టూపిడ్‌ గాడ్‌ అంటూ రొడ్రిగో ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేవుడిపై తన వ్యాఖ్యాలతో రోమన్‌ క్యాథలిక్‌ దేశమైన ఫిలిప్పీన్స్‌లో వివాదంగా మారుతున్నారు. దక్షిణ దవవొ నగరంలో సైన్స్‌, టెక్నాలజీ అంశంపై శనివారం రొడ్రిగో మాట్లాడుతూ... ‘అసలు ఈ సృష్టిలో దేవుడు అనేవాడు లేడు. ఎవరైనా దేవుడు వున్నాడని నిరూపిస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి. దేవుడి బొమ్మగాని, అతను మాట్లాడుతాడనిగాని ఎవరైనా నిరూపించగలరా? దేవుడు ఉన్నాడనే భావన చాలా మూర్ఖమైనది. ఇదేం మతమో’  అని వ్యాఖ్యానించారు. గతవారం రొడ్రిగో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ఆ స్టూపిడ్‌ గాడ్‌ ఎవరని, క్యాథలిక్‌ బిషప్‌లను మానసిక రోగులని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

డ్యూటర్ట్‌ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతిపక్ష నేత ఆంటోనియా ట్రిలియన్స్‌ రొడ్రిగోను ఒక దుష్టుడిగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా క్రూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను రొడ్రిగో అధికార ప్రతినిధి హ్యారి రోక్‌ తీవ్రంగా ఖండించారు. దేవుడిపైనా, మతాలపైన తన అభిప్రాయాన్ని రోడ్రిగో వ్యక్తపరిచారని, ఆ హక్కు ఆయనకు ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు