అధ్యక్షుడి వెనక నరహంతక కోణం

17 Sep, 2016 05:00 IST|Sakshi
అధ్యక్షుడి వెనక నరహంతక కోణం

మనీలా: చట్టాలను చేతుల్లోకి తీసుకోమని, డ్రగ్ స్మగ్లర్లు కనిపిస్తే కాల్చేయండని దేశ ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చి ఫిలిప్పీన్స్ వీధుల్లో రక్తపుటేరులను పారిస్తున్న దేశాధ్యక్షుడు రోడ్రిగో డూటర్టీ వెనకనున్న మరో భయంకర చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన దవావోకు మేయర్‌గా ఉన్నప్పటి నుంచే హత్యలకు పాల్పడుతున్నారని, మేయర్‌గానే ఆయన దాదాపు వెయ్యి మందిని హత్య చేశారని తెల్సింది. వారిలో ఎక్కువ మందిని కిరాయి హంతక ముఠాతో హత్య చేయించగా కొన్ని హత్యలను ఆయనే స్వయంగా చేశారని ఆయన హంతక ముఠా మాజీ సభ్యుడు ఎడ్గార్ మటోబాటో తెలిపారు. డూటర్టీ తన రాజకీయ శత్రువులను మొసళ్ల చేత తినిపించారని కూడా ఆయన చెప్పారు.

తాను డూటర్టీ హంతక ముఠా సభ్యుడిగా 25 ఏళ్ల కాలంలో అనేక మందిని హత్య చేశానని, ఓ జస్టిస్ అధికారిని డూటర్టీనే స్వయంగా కసితీరా కాల్చి చంపాడని హిట్‌మేన్ ఎడ్గార్ వెల్లడించారు. ఆయన ఈ విషయాలను మీడియా ముందుకాకుండా సెనేట్ దర్యాప్తు కమిటీ ముందు వెల్లడించడం విశేషం. డ్రగ్ అమ్మకందారులను, రేపిస్టులను, దొంగలను కాల్చి చంపమని తమకు ఆదేశాలు ఇచ్చేవారని ఆయన వివరించారు. చట్ట విరుద్ధంగా హత్యలు చేయాల్సిందిగా తన ముందే కొంత మంది అధికారులకు ఆదేశించేవారని ఆయన చెప్పారు.

దేశాధ్యక్ష పదవిని చేపట్టాక డూటర్టీ అదేశాల మేరకు పోలీసు అధికారులు, పౌరులు ఇంతవరకు రెండువేల మందికిపైగా అనుమానిత డ్రగ్ అమ్మకందారులను చట్టవిరుద్ధంగా కాల్చి చంపారు. చట్టం సంగతి తాను చూసుకుంటానని, డ్రగ్ అమ్మకందారులను చంపుమని పౌరులకు పిలుపునివ్వడం ద్వారా డూటర్టీ ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. మెజారిటీ మంచి ప్రజలను రక్షించేందుకు కొంతమంది దుష్టశక్తుల పట్ల టైస్టుగా మారడం నాయకుడి లక్ష్యమని  ఆయన ఆయన దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వ్యాఖ్యానించారు. తాను దేశాధ్యక్షుడినయ్యాక ఎన్ని శవాలు కావాలంటే అన్ని శవాలను సరఫరా చేస్తానని, బేషుగ్గా దేశ ప్రజలు శ్మశాన వ్యాపారాన్ని చేసుకోవచ్చని కూడా చెప్పారు.

తనకు ఆడవాళ్లంటే పిచ్చని కొందరు మాట్లాడుతున్నారని, అవును నిజంగా తనకు పిచ్చేనని, అందుకే రేపిస్టులను సహించనని, వారిని కాల్చివేస్తానని కూడా డూటర్టీ వ్యాఖ్యానించడం ఆయన నియంత పోకడలను తెలియజేస్తోంది. మానవ హక్కులను భంగపర్చడమంటే ముందుగా మానవులెవరో తేల్చాలని, చెడ్డవాళ్లు ఎప్పుడు మనుషులు కారని, వారికి ఎలాంటి హక్కులు ఉండవనే విషయాన్ని గ్రహించాలని ఇటీవల సైనిక శిబిరాన్ని సందర్శించినప్పుడు ఆయన వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు