ఫిలిప్పీన్స్‌లో ప్రళయం : 182 మంది మృతి

24 Dec, 2017 09:31 IST|Sakshi
తుపాను ధాటికి నిరాశ్రయులైన ఫిలిప్పీన్స్‌ ప్రజలు

మనీలా : భారీ తుపాను ధాటికి దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రజలు విలవిల్లాడారు. ‘టెంబిన్‌’ తుపాను సృష్టించిన బీభత్సానికి 182 మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. 153 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సివుందని అధికారులు వెల్లడించారు. టెంబిన్‌ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్‌లో మెరుపు వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున్న కొట్టుకొచ్చిన మట్టి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంది.

తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని చెప్పారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కు పైగా పెను తుపానులు విరుచుకుపడుతుంటాయి. వీటి వల్ల దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ద్వీపాలకు జరిగే నష్టం తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలుస్తోంది.

భారీగా కొట్టుకువచ్చిన మట్టి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు అడ్డుపడుతోంది. ఫిలిప్పీన్స్‌లో రెండో అతి పెద్ద ద్వీపమైన మిన్‌డనావోలో మెరుపు వరద సంభవించింది. దీంతో అక్కడ నివసించే 70 వేల మంది ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీస్‌ (ఐఎఫ్‌ఆర్‌సీ) తెలిపింది.

మరిన్ని వార్తలు