వైరల్‌ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు

14 Aug, 2018 10:29 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఎద్దు ఫోటో

ఇస్లామాబాద్‌ : గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్‌ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఫోటోగ్రాఫర్‌ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.

వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్‌ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్‌ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్‌ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్‌తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్‌ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈద్‌ అల్‌ అధా/ బక్రీద్‌ను  ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇ‍బ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇ‍వ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్‌ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్‌ను జరుపుకోనున్నారు.  

మరిన్ని వార్తలు