శ్రీలంక పేలుళ్లు; ఫొటో జర్నలిస్టు అరెస్టు

3 May, 2019 10:38 IST|Sakshi

కొలంబో : నిబంధనలు అతిక్రమించాడన్న కారణంగా ఓ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మే15 వరకు నెగోంబో మెజిస్ట్రేట్‌ అతడికి రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు. ఈస్టర్‌ ఆదివారం నాడు శ్రీలంకలో ముష్కరులు సృష్టించిన నరమేధంలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నివసించే రాయిటర్స్‌ జర్నలిస్టు సిద్ధిఖి అహ్మద్‌ డానిష్‌ న్యూస్‌ కవరేజ్‌ కోసం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా నెగోంబో సిటీకి చేరుకున్న ఆయన అనుమతి లేకున్నా ఓ స్కూళ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వరుస పేలుళ్లలో మరణించిన ఓ విద్యార్థి కుటుంబాన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లగా పోలీసులు సిద్ధిఖిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నెగొంబో మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా ఈనెల 15వరకు రిమాండ్‌ విధించారు. ఇక ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్‌ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్‌ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్‌ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్‌ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు