డోర్ ఓపెన్ కాలేదట..

26 Mar, 2015 10:50 IST|Sakshi
డోర్ ఓపెన్ కాలేదట..

వాషింగ్టన్ :  ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో జర్మనీకి చెందిన ఎయిర్బస్ ఎ-320 విమానం కూలిపోవడానికి పైలటే కారణమా? కాక్పిట్ తలుపు తెరుచుకోకపోడమే ప్రమాదానికి కారణమా? విమానంలో  ఉన్న ఇద్దరు  పైలట్లలో ఒకరు కాక్పిట్ నుంచి బయటికి వెళ్లడం వల్లనే విమానం కూలిపోయిందా... అసలు  ఆ పైలట్ బైటికి ఎందుకు వెళ్లాడు...   ఇవన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను పరిశీలిస్తున్న సీనియర్ సైనిక అధికారి అనుమానాలు.

విమాన ప్రమాదంలో కీలకమైన సమాచార సేకరణలో భాగంగా కాక్పిట్ వాయిస్  రికార్డర్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ అధికారి విమానం కూలిపోవడానికి కొన్ని  క్షణాల ముందు   ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.  అయితే  పైలట్ కాక్పిట్ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ తిరిగి కాక్పిట్లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించి విఫలమైన విషయం స్పష్టంగా రికార్డు అయినట్లు చెబుతున్నారు.

అలాగే  పైలట్  ఎందుకు బైటికి వెళ్లాడు? కాక్పిట్లో రెండవ పైలట్  ఒక్కడే ఉన్నాడా..డోర్ తెరవలేకపోయాడా? అనేది కూడా ఖచ్చితంగా  నిర్ధారించలేమంటున్నారు. మొదటి బ్లాక్బాక్స్లో కొన్ని శబ్దాలు, మాటలు రిజిస్టర్ అయినట్లు ఫ్రాన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో హెడ్ రెమీ జౌటీ   కూడా నిర్ధారించారు. 

 

పైలట్ తలుపును గట్టిగా  కొడుతున్న శబ్దాలు, మాటలు నమోదయ్యాయనీ.. అయితే పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చన్నారు.   జర్మన్ వింగ్స్ ఎయిర్బస్  ఎ320 మంగళవారం కూలిపోయిన దుర్ఘటనలో  ఆరుగురు సిబ్బంది సహా 144 ప్రయాణీకులు  అసువులు బాసిన సంగతి తెలిసిందే. కాగా  ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది.

మరిన్ని వార్తలు