పైలట్‌ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం

4 Jun, 2020 16:39 IST|Sakshi

కరాచి : గత మే 22న పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఎ320 ఎయిర్‌బస్‌ విమానం  ఇంజిన్లు సహకరించకపోవడంతో పైలట్‌ అర్థంతరంగా ల్యాండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 97 మంది దుర్మరణం చెందగా, ఇదరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా దీనిపై పాకిస్తాన్ ఏవియేషన్ అధికారులు పీఐఏకు మరోసారి నివేదికను అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను పట్టించుకోకుండానే ప్రయాణీకులతో వెళుతున్న ఎ320 ఎయిర్‌బస్‌ విమానాన్ని పైలట్‌ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు తెలిపారు. కేవలం పైలట్‌ తప్పిదం వల్లే ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుందని ఏవియేషన్‌ అధికారులు మరోసారి తేల్చి చెప్పారు.(కుప్పకూలిన పాక్‌ విమానం)

'ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్‌ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్‌ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్‌ బస్‌ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు 15 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు.

కాగా ఇంతకుముందు సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ(సీఏఏ)కు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో  పైలెట్‌ విమానాన్ని ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్‌ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్‌ ట్యాంక్‌, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్‌, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.(పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!)

పీఐఏ జనరల్ మేనేజర్ అబ్దుల్లా హఫీజ్ ఖాన్ రాయిటర్స్‌తో స్పందిస్తూ.. ' అవును, మాకు లేఖ వచ్చింది, వారు దానిని డాక్యుమెంట్ చేస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా బాక్స్‌ను ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వైమానిక ఏజెన్సీ బీఏ డీకోడ్ చేస్తోందని' పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను జూన్ 22 న పార్లమెంటుకు అందజేస్తామని పాక్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు.

మరిన్ని వార్తలు