ఇంటిపై కూలిన విమానం- ముగ్గురి మృతి

29 Jun, 2015 11:15 IST|Sakshi
ఇంటిపై కూలిన విమానం- ముగ్గురి మృతి

వాషింగ్టన్:  గాల్లో ఎగరాల్సిన విమానం  అకస్మాత్తుగా జనావాసాలమీదికి  దూసుకువచ్చింది.  బోస్టన్లోని ఒక ఇంటిపై విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.  భారీగా ఎగిసిపడిన అగ్నికి  విమానంలోని ముగ్గురు సిబ్బంది ఆహుతయ్యారు.  ఆదివారం ఉదయం ఈ  దుర్ఘటన  చోటు చేసుకుంది.
అమెరికాలోని పెన్సిల్వేనియా నుండి మసాచుసెట్స్కు  బయలుదేరిన   బీచ్ క్రాఫ్ట్ BE36  విమానం బోస్టన్లోని ప్లెయిన్ విల్లేలోని ఒక ఇంటిపై కూలిపోయింది.  దీంతో మంటలు చెలరేగాయి. ఆ ఇంటిని  చుట్టుముట్టిన  మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు దాదాపు మూడుగంటలుపాటు కష్టపడాల్సి వచ్చింది.  అయితే ఈ ప్రమాదంనుంచి  ఆ ఇంటిలో నివాసం ఉంటున్న వారు అదృష్ట వశాత్తూ తప్పించుకున్నారు.
తమ ఇంటివైపు దూసుకువస్తూ కూలిపోతున్నవిమానాన్ని  చూశామని, భయభ్రాంతులకు  లోనయ్యామని  ప్రత్యక్షసాక్షులు తెలిపారు.  ఇంజిన్లోంచి శబ్దాలు గమనించామని,  పెద్దశబ్దంతో విమానం కూలిపోయిన తర్వాత భారీ ఎత్తున పొగ వ్యాపించిందని తెలిపారు.
 మరణించినవారిని గుర్తించేంతవరకు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వివరాలను  వెల్లడించలేమని ఫెడరల్ ఏవియేషన్ ఎడ్మినిస్ట్రేషన్ అధికారి జిమ్ పీటర్స్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు