ఇప్పటికీ ఆచూకీ లేని 77 ఏళ్లనాటి విమానం

19 Mar, 2014 13:50 IST|Sakshi
ఇప్పటికీ ఆచూకీ లేని 77 ఏళ్లనాటి విమానం

అమీలియా ఇయర్హార్ట్... మలేషియా విమానం మటుమాయం అజాపజా లేకుండా పోయిన తరువాత ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తోంది. ఈమె కథ కూడా మలేషియా విమానం లాగానే సశేషంగా మిగిలిపోయింది.


77 ఏళ్ల క్రితం అమీలియా విమానం నడుపుతూ నడుపుతూ మాయమైపోయింది. ఆమె దొరకలేదు. ఆమె నడిపిన విమానమూ దొరకలేదు. ఆమె కనుమరుగై ఇన్నేళ్లైనా ప్రపంచ విమానయాన రంగం, ముఖ్యంగా అమెరికన్లు ఆమెను తలచుకుంటూనే ఉన్నారు.
అమీలియా తొలితరం మహిళా పైలట్. రచయిత. ఆమె విమాన యానంలో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. మహిళలకు మగవారికి సమాన హక్కులుండాలని పోరాడిన ఉద్యమకర్త. ఆ రోజుల్లో ఆమె అంటే ఎనలేని క్రేజ్ ఉండేది.


1937 లో లాక్ హీడ్ మోడల్ 10 ఎలెక్ట్రా విమానంలో ప్రపంచయాత్ర చేయడానికి ఆమె ఒంటరిగా బయలుదేరింది. పసిఫిక్ మహాసముద్రంలోని హోవార్డ్ ద్వీపం వరకూ ఆమె గ్రౌండ్టవర్ తో సంబంధాలు కొనసాగాయి. ఆ తరువాత ఆమె ఏమైందో, ఆమె విమానం ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియలేదు. 1937 జులై 6 న ఆమె చివరి మెసేజ్ పంపించింది. ఆ తరువాత సిగ్నల్ అందలేదు. ఆమె కోసం నెల రోజుల పాటు గాలింపు జరిగింది. అమెరికన్ నేవీ, వైమానిక దళం దాదాపు మూడు మిలియన్ల డాలర్లను ఆ రోజుల్లోనే ఆమెను వెతికేందుకు ఖర్చు చేశాయి.


ఆమె చనిపోయిందని కొందరు వాదిస్తే, లేదు లేదు ఆమె ఒక గూఢచారి, అమెరికాకు చిక్కకుండా ఉండేందుకే ఇలా చేసిందని కొందరు వాదించారు. కొందరైతే ఆమె తాను చనిపోయినట్టు కట్టుకథలు అల్లి వేరే పేరుతో ఎక్కడో అజ్ఞాతవాసం చేసిందని వాదించారు.
మొత్తం మీద ఇన్నేళ్లయినా అమీలియా ఇయర్హార్ట్ గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మాత్రం ఆగలేదు. మలేషియా విమానం దుస్సంఘటన తరువాత అమీలియా మరోసారి వార్తాకథనాలకెక్కింది. మళ్లీ చర్చాంశం అయింది.
 

మరిన్ని వార్తలు