ఎన్నికలకు ఇన్‌స్టాగ్రామ్‌ ‘ప్లేబాయ్‌’ సై

14 Nov, 2019 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఎల్లప్పుడు చుట్టూ అందమైన అమ్మాయిలతో విలాసవంతమైన పార్టీలతో కాలక్షేపం చేసే ‘ప్లేబాయ్‌’గానే కాకుండా, ప్రముఖ సోషల్‌ మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ కింగ్‌గా గుర్తింపు పొందిన డేన్‌ బిల్జేరియన్‌ 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాత్రం హిల్లరీ క్లింటన్‌పై పోటీచేసే కన్యే వెస్ట్‌కే ఓటు వేస్తానని ఆయన అన్నారు. నాపైనే కన్యే వెస్ట్‌ పోటీ చేస్తారని భావిస్తున్నానని పగలబడి నవ్వుతూ చెప్పారు. నిజంగా 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, ముమ్మాటికి అని చెప్పలేనుగానీ, ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికీ అన్నివిధాల సిద్ధం కావచ్చని భావిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 కోట్ల మంది అభిమానులున్న బిల్జేరియన్‌ తెలిపారు. అమెరికా, ఫ్లోరిడాలోని టంపాలో జన్మించిన బిల్జేరియన్‌కు 38 ఏళ్లు.

విలాసవంతమైన సొంత పడవ (యాట్‌)లో మిస మిసలాడే భామలతో కులుకుతూ, మిత్రులతో గడుపుతూ, పరిచారక బృందం సేవల మధ్య సుందర సముద్ర తీరాల వెంట తిరుగుతూ, దీవుల్లోని విలాసవంతమైన భవనాల్లో బస వేస్తూ, విందు వినోదాల్లో తేలిపోవడం, వాటి తాలూకు ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ఆయనకు సరదా. ఇప్పుడు అదే వృత్తి కూడా. ఆయనకు అమెరికాలో ఉన్న మూడు విలాసవంతమైన ఇళ్ల పరిసరాల్లో కూడా ఆయన ముద్దగుమ్మలతో నడిపే శృంగార లీలల గురించి గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తుంటాయి. పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ బిల్జేరియన్‌ ‘పోకర్‌ స్టార్‌’గాను, పలు వ్యాపారాల ద్వారాను అంతులేని సంపదనను సమకూర్చుకున్నారు. ‘లోన్‌ సర్వైవర్‌’ అనే హాలీవుడ్‌ సినిమాను కూడా నిర్మించారు. ఇప్పటిలాగే ఖర్చు పెట్టినా రెండు, మూడు జన్మల వరకు ఆయన సంపద తరగదు. డబ్బే కాకుండా మంచి శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా ఉండడం ఆయన వెంట అమ్మాయిలు పడడానికి మరో కారణం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్జేరియన్‌ మద్దతిస్తానంటున్న కన్యే వేస్ట్‌ ప్రముఖ అమెరికా పాప్‌ సింగరే కాకుండా అమెరికా ప్రముఖ మోడల్, టీవీ ప్రెజంటర్, వ్యాపార వేత్త కిమ్‌ కర్దాషియిని భర్త. అమెరికా ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తానన్న విషయం ఆయన ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ కంటే డొనాల్డ్‌ ట్రంప్‌నే ఇష్టపడతానని బిల్జేరియన్‌ 2016 ఎన్నికలకు ముందే చెప్పారు. అప్పటికే ఆయనకు ట్రంప్‌తో పరిచయం ఉంది. పరిచయం ఉన్న వ్యక్తిగా కాకుండా రాజకీయాల్లో ఇంకా రాటుదేలని వ్యక్తిగా, రాజకీయాల్లో మొరటువాడిగా భావించి, అలాంటి వారయితే దేశం కోసం అంతో, ఇంతో కృషి చేస్తారని భావించి సమర్థించినట్లు ఫలితాల అనంతరం లారీ కింగ్‌ అనే జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు