అత్యంత శక్తిమంతుల్లో

10 May, 2018 02:42 IST|Sakshi

మోదీకి 9వ ర్యాంకు

ఫోర్బ్స్‌ జాబితాలో జిన్‌పింగ్‌ టాప్‌

న్యూయార్క్‌: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో కూడిన ఫోర్బ్స్‌ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి 9వ స్థానం దక్కింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అధిగమించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్‌ ఈ జాబితాను వెలువరించింది.

మోదీతో పాటు జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ(32వ ర్యాంకు), ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌(13), బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే(14), చైనా ప్రధాని లీకెకియాంగ్‌(15), యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌(24) కన్నా మోదీ ముందంజలో ఉన్నారు.

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు 40వ స్థానం దక్కింది. ‘ఈ భూమ్మీద మొత్తం 7.5 బిలియన్ల మంది జీవిస్తున్నారు. అందులో ఈ 75 మంది ప్రపంచ గతిని మార్చారు. ప్రతి 100 మిలియన్ల మందికి ఒకరి చొప్పున ఈ ఏడాది అత్యంత శక్తిమంతుల జాబితాను రూపొందించాం’ అని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది. భారత్‌లో మోదీకి ఆదరణ కొనసాగుతోందన్న ఫోర్బ్స్‌.. 2016 నాటి నోట్లరద్దు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జియో సేవలు ప్రారంభించిన రిలయన్స్‌ భారత టెలీ మార్కెట్‌లో చవక టారిఫ్‌ల యుద్ధానికి తెరతీసిందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు