మాల్దీవులు చేరుకున్న ప్రధాని

17 Nov, 2018 19:29 IST|Sakshi

మాల్దీవులు చేరుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహమద్‌ సోలీహ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం మాల్దీవులు చేరుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఇబ్రహీం ఫోన్‌ చేయడంతో ఆయన ఆహ్వానాన్ని మోదీ స్వీకరించారు.

కాగా సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌పై.. విపక్ష కూటమి అభ్యర్థి ఇబ్రహీం మహమద్‌ సోలీహ్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా యామీన్‌ గద్దెనెక్కిన నాటి నుంచి నియంత పోకడలు అనుసరించారు. అంతేకాకుండా మాల్దీవులతో ఎన్నో ఏళ్లుగా మిత్ర బంధాన్ని పాటిస్తున్న భారత్‌ను పక్కన పెట్టి... చైనాతో స్నేహం చేశారు. భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న కొన్ని దీవులను చైనాకు లీజుకు ఇచ్చారు కూడా. అదే విధంగా దాయాది దేశం పాకిస్తాన్‌తో సరికొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో దౌత్యపరంగా భారత్‌పై చైనా పైచేయి సాధించినట్లైంది. అయితే ప్రస్తుతం ఇబ్రహీం ప్రమాణస్వీకారోత్సవానికి మోదీ హాజరు కానుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. (చదవండి : చైనాపై మోజు.. భారత్‌కు షాక్‌!)

మరిన్ని వార్తలు