ఉజ్బెక్‌తో బంధం బలోపేతం

7 Jul, 2015 00:18 IST|Sakshi
ఉజ్బెక్‌తో బంధం బలోపేతం

తాష్కెంట్‌లో కరిమోవ్‌తో మోదీ చర్చలు
* ఇంధనం, రక్షణ, వాణిజ్యాల్లో మరింత సహకారం
* మూడు ఒప్పందాలు..
* ఉగ్రవాదంపై ఆందోళన

తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్‌తో చర్చలు జరిపారు. అణు ఇంధనశక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

ఉజ్బెక్ నుంచి భారత్‌కు యురేనియం సరఫరా చేయటం కోసం గత ఏడాది కుదుర్చుకున్న కాంట్రాక్టును అమలు చేసే మార్గాలపై చర్చించారు. ఇరు దేశాల ఇరుగు పొరుగుల్లో ఉగ్రవాదం పెరుగుతుండటంపై చర్చించారు. యుద్ధం వల్ల కల్లోలమైన అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితి సహా పలు ప్రాంతీయ అంశాలపై సమీక్షించారు. భారత్, రష్యా, ఇరాన్, యూరప్, మధ్య ఆసియాల మధ్య సరకు రవాణా కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ప్రాజెక్టు గురించి కరిమోవ్‌కు మోదీ వివరించారు.

ఆ ప్రాజెక్టులో ఉజ్బెక్ కూడా భాగస్వామిగా అయ్యే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. అలాగే.. ఉజ్బెకిస్తాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఒమన్‌ల మధ్య ప్రయాణ ఒప్పందమైన అష్గాబాట్ అగ్రిమెంట్‌లో భారత్ కూడా చేరేందుకు ఉజ్బెక్ మద్దతివ్వాలని కోరారు. భేటీ  తర్వాత రెండు దేశాల విదేశాంగ కార్యాలయాల మధ్య, సంస్కృతి, పర్యాటక రంగంలో సంబంధాలను బలోపేతం చేసే దిశగా మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

ఆసియాలో భారత్ ఉజ్బెక్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ తన పర్యటనను ఈ దేశం నుంచి మొదలుపెట్టానని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వైపాక్షిక సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఈ ఏడాది సమావేశమవుతుందని చెప్పారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవటం తమ దేశ అత్యున్నత విదేశాంగ ప్రాధాన్యాల్లో ఒకటని కరిమోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వ డిమాండుకు ఉజ్బెకిస్తాన్ తన మద్దతును పునరుద్ఘాటించింది.
 
మధ్య ఆసియా దేశాల పర్యటన షురూ
మధ్య ఆసియాలోని ఐదు దేశాల పర్యటనతో పాటు రష్యాలో శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు మోదీ సోమవారం 8 రోజుల విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలి అడుగులో భాగంగా ఆయన ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని మిరోమోనోవిచ్ మీర్జియోయెవ్  స్వాగతం పలికారు. మోదీ మంగళవారం కజకిస్తాన్ వెళ్తారు.

ఈ నెల 8న రష్యా చేరుకుని ఆ దేశంలోని ఉఫా నగరంలో జరిగే ‘బ్రిక్స్’, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులకు హాజరవుతారు. 10న తుర్క్‌మెనిస్తాన్‌కు, 11న కిర్గిజిస్తాన్, 12న తజకిస్తాన్‌కు వెళ్తారు. రష్యాలోని ఉఫాలో జరిగే ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశం కానున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరు  నవంబర్‌లో కఠ్మాండులో సార్క్ సదస్సులో కలుసుకున్నప్పటికీ.. ఎలాంటి చర్చలూ జరపలేదు.

>
మరిన్ని వార్తలు