ఉగ్రవాదంపై ఐక్య పోరాటం

9 Jun, 2017 00:59 IST|Sakshi
ఉగ్రవాదంపై ఐక్య పోరాటం

కార్యాచరణ వివరించనున్న ప్రధాని మోదీ
► నేడు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు
► ఎస్‌సీఓలో భారత్, పాక్‌లకు శాశ్వత సభ్యత్వం


అస్తానా: కజకిస్తాన్‌ రాజధాని అస్తానాలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచానికి పెనుసవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు. వివిధ దేశాల్లో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించనున్నారు. ఎంతో కాలంగా భారత్, పాకిస్తాన్‌లు ఎదురుచూస్తున్న ఎస్‌సీఓ శాశ్వత సభ్యత్వానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. 2001లో ఎస్‌సీఓ ఏర్పడిన తరువాత తొలిసారిగా విస్తరిస్తుండటం విశేషం.

చైనా, రష్యా తదితర ప్రధాన మధ్య ఆసియా దేశాధినేతలు పాల్గొంటున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ గురువారం అస్తానా చేరుకున్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తారు. ఆర్థిక, అనుసంధాన అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారంపై ముందడుగు వేసేందుకు ఎస్‌సీఓ సమావేశం కీలకం కానుందని అస్తానా బయలుదేరేముందు మోదీ పేర్కొన్నారు. చైనా ఆధిపత్యం సాగుతున్న ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య లావాదేవీల్లో భారత్‌కు మైలురాయిగా నిలుస్తుంది. భారత్, పాక్‌ల సభ్యత్వం... ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి, వాణిజ్య, పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఎస్‌సీఓ సెక్రటరీ జనరల్‌ రషీద్‌ అలిమోవ్‌ చెప్పారు.

చైనా అధ్యక్షుడితో సమావేశం!
ప్రధాని మోదీ ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అణు ఇంధన సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వ ప్రయత్నాలు, చైనా–పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ సహా వివిధ అంశాల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది.

కజక్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ...
అస్తానా చేరుకున్న మోదీ గురువారం కజకి స్తాన్‌ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్‌ నజార్బ యేవ్‌ తో భేటీ అయ్యారు. మోదీ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పలకరించుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్, పాక్‌ ప్రధాని షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎస్‌సీఓలో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు