సమష్టిగా విపత్తు నిర్వహణ

30 Jun, 2019 04:05 IST|Sakshi
మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ

అంతర్జాతీయ కూటమికి సహకారం అందించండి

జి20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

ఆస్ట్రేలియా, టర్కీ సహా ఆరుగురు దేశాధినేతలతో భేటీ

ఒసాకా: విపత్తు నిర్వహణ విషయంలో జి20 బృందం ప్రపంచదేశాలతో కలిసి కూటమిగా ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు, పునరావాసం ఎంత త్వరగా చేపడితే నష్టం అంత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వైపరీత్యాల సమయంలో నిరుపేద ప్రజలే ఎక్కువగా నష్టపోతుంటారని వ్యాఖ్యానించారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో జరుగుతున్న జి20 సదస్సులో శనివారం ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘విపత్తులను తట్టుకునే మౌలికవసతుల కల్పన కోసం అంతర్జాతీయ కూటమితో చేతులు కలపాలని జి20 దేశాలను నేను కోరుతున్నాను. ఈ రంగంలో తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. రండి.. సురక్షితమైన ప్రపంచం కోసం మనమందరం చేతులు కలుపుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు. విపత్తులను తట్టుకునే మౌలికవసతుల ఏర్పాటు అన్నది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఈ మౌలిక వసతులు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు.

బిజీబిజీగా మోదీ..
జి20 సదస్సు చివరి రోజైన శనివారం ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమైన మోదీ వాణిజ్యం ఉగ్రవాదంపై పోరు, తీరప్రాంత భద్రత, రక్షణ సహా పలు అంశాలపై చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడోతో మోదీ తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, తీర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

అనంతరం బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బాల్సోనారోతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జీవ ఇంధనాలు, వాతావరణ మార్పు వంటి అంశాలపై మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ను కలుసుకున్నారు. భారత్‌–టర్కీల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌ ప్రధాని లీహసియన్‌ లూంగ్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరాలతో ప్రధాని మోదీ సుహృద్భావ పూర్వకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయా దేశాధినేతలతో  వీరు చర్చించారు.  

కితనా అచ్చేహై మోదీ!
భారత ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఇచ్చిన కితాబు ఇది. ఒసాకాలో జరిగిన జి–20 సదస్సుకు హాజరయిన మారిసన్,మోదీలు శనివారం సమావేశమయ్యారు. క్రీడలు, గనుల తవ్వకం, రక్షణ, తీర ప్రాంత భద్రత వంటి విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు అంగీకరించారు. ఆ సందర్భంగా మారిసన్‌ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు. దాన్ని ట్విట్టర్‌లో పెట్టారు. ఆ ఫొటోకు ‘కితనా అచ్చే హై మోదీ’అని కాప్షన్‌ ఇచ్చారు. దాన్ని చూసి మోదీ మురిసిపోయారు. ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ మారిసన్‌ను ‘మేట్‌’అని సంబోధించారు. ఆస్ట్రేలియా భాషలో మేట్‌ అంటే స్నేహితుడని అర్థం. భారత్‌–ఆస్ట్రేలియా సంబంధాల పట్ట సంతోషంగా ఉన్నానని మోదీ ట్వీట్‌ చేశారు.‘కితనా అచ్చే హై మోదీ అంటూ హిందీలో నన్ను అభినందించడం ద్వారా ఈ ట్వీట్‌ను వైరల్‌ చేశారు.దానికి నేను కృతజ్ఞుడిని’అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు