ఇండోనేసియా చేరుకున్న మోదీ

30 May, 2018 03:57 IST|Sakshi
జకార్తాలో మోదీకి స్వాగతం పలుకుతున్న దృశ్యం

నేడు అధ్యక్షుడితో చర్చలు.. భారతీయులతో సమావేశం  

జకార్తా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇండోనేసియాకు చేరుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఇండోనేసియాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఆ దేశ రాజధాని జకార్తా చేరుకున్న వెంటనే మోదీ ఇంగ్లిష్, ఇండోనేసియా భాషల్లో ట్వీట్‌ చేస్తూ ‘జకార్తాలో దిగాను. నాగరికత, చారిత్రక విషయాల్లో భారత్, ఇండోనేసియాల మధ్య బలమైన బంధం ఉంది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, ప్రయోజనాలను నా పర్యటన మరింత విస్తృతం చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడోతో మోదీ బుధవారం భేటీ అయ్యి, తీరప్రాంత అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు. వారిద్దరూ కలసి వివిధ కంపెనీల సీఈవోల సదస్సులో పాల్గొంటారు.

అనంతరం ఇండోనేసియాలోని భారతీయులతో మోదీ సమావేశమవుతారు. గురువారం మలేసియా వెళ్లి, కొత్తగా ఎన్నికైన ప్రధాని మహథిర్‌ మహ్మద్‌ను మోదీ కలిసి శుభాకాంక్షలు చెబుతారు. మహథిర్‌తో చర్చలు జరిపిన అనంతరం సింగపూర్‌ వెళ్తారు. శుక్రవారం అక్కడ షాంగ్రీ లా డైలాగ్‌లో ప్రసంగిస్తారు. భద్రతాంశాలపై ప్రతి ఏడాదీ జరిగే సదస్సును షాంగ్రీ లా అని పిలుస్తారు. ‘ఈ సదస్సులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాల పరిరక్షణ పట్ల భారత వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. సింగపూర్‌ అధ్యక్షురాలు హలీమా యాకుబ్, ప్రధాని లీ హ్సీన్‌ లూంగ్‌లను కూడా మోదీ కలుస్తారు. మహాత్మా గాంధీ అస్థికలను సముద్రంలో కలిపిన చోటైన ‘క్లిఫర్డ్‌ పియర్‌’ వద్ద మోదీ ఓ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
 

మరిన్ని వార్తలు