అంతా భారత్‌ చేతుల్లోనే!

11 Feb, 2018 03:04 IST|Sakshi
పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌తో మోదీ కరచాలనం

ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియపై పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌

పాలస్తీనా అభివృద్ధికి మేం తోడుంటాం: ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్‌ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌.. భారత ప్రధాని మోదీని కోరారు. అంతకుముందు, మోదీకి రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్‌  శాంతి ఒప్పందాలపై చర్చించారు.

రమల్లా: ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్‌ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌.. భారత ప్రధాని మోదీని కోరారు. శాంతి నెలకొల్పే అంశంలో వివిధ దేశాలతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యతను మోదీ భుజస్కంధాలపై పెట్టారు. అంతకుముందు, మోదీకి (పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధాని) రమల్లాలో ఘన స్వాగతం లభించింది.

అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్‌ దాదాపు 50 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్‌ ప్రభావం కారణంగానే ఈ శాంతిప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని కోరామని అబ్బాస్‌ వెల్లడించారు.

పాలస్తీనాకు అండగా ఉంటాం
పాలస్తీనా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్‌ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మోదీ అన్నారు. ‘భారత్, పాలస్తీనాల మధ్య స్నేహం పురాతనమైనది. పాలస్తీనా అభివృద్ధి ప్రయాణంలో భారత్‌ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. చర్చల ప్రక్రియ ద్వారా పాలస్తీనా త్వరలోనే స్వతంత్ర, సార్వభౌమ దేశంగా నిలవనుంది’ అని మోదీ అన్నారు. పాలస్తీనాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పే ప్రక్రియలో భారత్‌ మద్దతుంటుందని.. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. దౌత్యం, దూరదృష్టి మాత్రమే హింసకు అడ్డుకట్ట వేయగలవన్నారు. ‘ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ మేం ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు.

యూఏఈతో ఐదు ఒప్పందాలు
పాలస్తీనాలో శాంతి నెలకొల్పేందుకు భారత నాయకత్వం మొదట్నుంచీ అండగా నిలుస్తోందని అబ్బాస్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పాలస్తీనాతోపాటు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను మోదీకి వివరించామన్నారు. అయితే.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా అంగీకరించాల్సిందేనని అబ్బాస్‌ పేర్కొన్నారు. జోర్డాన్‌ నుంచి యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీకి అబుధాబి యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమై.. విస్తృతాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్‌ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057వరకు 40 ఏళ్లపాటు అమ ల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్‌ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.  

మోదీకి అరుదైన గౌరవం
పాలస్తీనా పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ద స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’తో సత్కరించింది. అంతకుముందు జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌ నుంచి రమల్లా వరకు మోదీ హెలికాప్టర్‌కు ఇజ్రాయెల్‌ హెలికాప్టర్లు రక్షణగా వచ్చాయి.  హెలికాప్టర్‌ దిగగానే.. పాలస్తీనా ప్రధాని హమ్‌దల్లా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం (మఖాటా)లో ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమానికి అబ్బాస్‌ ఆలింగనంతో ఆహ్వానించారు. రమల్లాలోని యాసర్‌ అరాఫత్‌ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.

 


పాలస్తీనా తమ విదేశీ అతిథులకిచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ద స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’తో మోదీని సత్కరిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్‌ అబ్బాస్‌. శనివారం రమల్లాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందించారు.

మరిన్ని వార్తలు