పాక్‌కు బుద్ధిచెప్పండి

14 Jun, 2019 03:43 IST|Sakshi
బిష్కెక్‌లో జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనం, పుతిన్‌ను ఆలింగనం చేసుకుంటున్న మోదీ

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ

పుతిన్‌తోనూ భేటీ

షాంఘై సహకార సదస్సు

సందర్భంగా విడివిడిగా సమావేశం

బిష్కెక్‌/వాషింగ్టన్‌: కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు‡ పుతిన్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మోదీ స్పందిస్తూ.. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ‘భారత్‌–చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఈ భేటీలో చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రమూకలపై పాక్‌ కఠినచర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఉగ్రరహిత వాతావరణంలో పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  

జిన్‌పింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు..
అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మోదీని జిన్‌పింగ్‌ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని.. జూన్‌ 15న 66వ పుట్టినరోజు జరుపుకోనున్న జిన్‌పింగ్‌కు భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్‌–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్‌ నిర్ణయించారు. బిష్కెక్‌లో ఎస్‌సీవో భేటీ జూన్‌ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది.

మోదీ సరికొత్త నాయకుడు: పాంపియో
అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఇండియా ఐడియాస్‌ సదస్సులో పాంపియో మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుపొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సరికొత్త నాయకుడిగా మోదీ అవతరించారు’ అని కితాబిచ్చారు. భారత  యువతకు సుసంపన్నమైన, ఉజ్వల భవిష్యత్తును మోదీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లతో పాటు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటుకు సాయమందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జూన్‌ 24 నుంచి 30 వరకూ పాంపియో భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించనున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు