మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్

29 May, 2020 08:21 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్ : భారత్, చైనా సరిహద్దు వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి ప్రకటించారు. ఇండో-చైనా స‌రిహ‌ద్దులో త‌లెత్తిన ప్ర‌తిష్ఠంభ‌న తొల‌గించేందుకు త‌న ప్ర‌మేయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రెండు దేశాలు భావిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను ఫోన్ లో సంప్రదించాననీ, అయితే ఆ స‌మ‌యంలో ఆయ‌న మంచి మూడ్ లో లేరని  చెప్పారు.  140 కోట్ల జ‌నాభా ఉన్న రెండు పెద్ద దేశాలు భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు విష‌యంలో స‌మ‌స్య న‌డుస్తోంద‌న్నారు. అయితే, ప్రధాని మోదీతో ఎప్పుడు మాట్లాడారో ట్రంప్ స్పష్టం చేయలేదు. (మధ్యవర్తిత్వం చేస్తా)

వైట్ హౌస్ లో గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వంపై ప్రశ్నించినపుడు తాను అందుకు సిద్ధంగా ఉన్నానంటూ  ట్రంప్ చెప్పారు.  చైనా, భారత్  దేశాలకూ బ‌ల‌మైన మిల‌ట‌రీ శ‌క్తి ఉంద‌ని, ప్రస్తుత వివాదంతో ఇరుదేశాలు  అసంతృప్తితో ఉన్నాయ‌ని అన్నారు. లదా‌ఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు భార‌త్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఉద్రిక్త‌త నెలకొన్న నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  (‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’)

కాగా చైనాతో త‌లెత్తిన ఈ స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా చర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించుకుంటామ‌ని భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. చ‌ర్చ‌ల ద్వారా  శాంతియుతంగా పరిష్కరించుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. అంతకుముదు భార‌త్ చైనా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు మంచి వాతావ‌ర‌ణం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ  ప్రతినిధి జావో లిజియన్ కూడా  ప్రకటించారు.

మరిన్ని వార్తలు