కలిసి పనిచేయాలని ఉంది

27 May, 2019 04:27 IST|Sakshi

మోదీతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

ముందుగా ఉగ్రవాద రహిత వాతావరణం అవసరమన్న మోదీ

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: భారత్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదివారం ఫోన్‌ చేశారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధన కోసం హింస, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాల్సి ఉందని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడంతోపాటు దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధనకు మోదీతో కలిసి పనిచేయాలని ఉందంటూ ప్రధాని ఇమ్రాన్‌ తన ఆకాంక్షను వ్యక్తం చేశారని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ తెలిపారు. ఇరు దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. అయితే, ప్రధాని ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ...ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద, హింసా రహిత వాతావరణం నెలకొనాలని, పరస్పరం విశ్వాసం పెంపొందాలని పేర్కొన్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు