10 దేశాల్లోని 27 పత్రికల్లో మోదీ వ్యాసం

27 Jan, 2018 02:45 IST|Sakshi
ఆసియాన్‌ దేశాల పత్రికల్లో మోదీ వ్యాసం

సింగపూర్‌:  భారత్, ఆసియాన్‌ దేశాల సంబంధాలు వివాదాలు, విమర్శలకు అతీతమైనవని మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవాన 10 ఆసియాన్‌ దేశాల అధినేతలు భారత్‌కు అతిథులుగా వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ రాసిన వ్యాసం 10 భాషల్లో, 27 పత్రికల్లో ప్రచురితమైంది. 10 ఆసియాన్‌ దేశాల్లోని పత్రికలు ఒకే రోజున మోదీ వ్యాసాన్ని ప్రచురించడం విశేషం. ఆసియాన్‌ దేశాలతో భారత భాగస్వామ్యం, భవిష్యత్తు గురించి మోదీ ఈ వ్యాసంలో రాశారు.

ఆసియాన్‌ దేశాలతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు భారత్‌ ఎంతో ఆసక్తిగా ఉందని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు. థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనై దేశాల్లో మోదీ వ్యాసం ప్రచురితమైంది. భారత్‌–ఆసియాన్‌ 25 ఏళ్ల సంబంధాలను గుర్తుచేసుకుంటూ ఆ దేశాధినేతలందరినీ 69వ గణతంత్రదినోత్సవాన భారత్‌లో కలుసుకోవడం తనకు గౌరవంగా ఉందని మోదీ వ్యాసంలో రాశారు. ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌కు రెండు వేల ఏళ్లకు పైగానే సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు.  

ఆసియాన్‌ నేతలతో మోదీ భేటీ
ప్రధాని మోదీ శుక్రవారం మలేసియా, లావోస్‌ ప్రధానులతోపాటు ఇండోనేసియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన వీరంతా శుక్రవారం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం, సంబంధాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు.

తర్వాత ప్రధాని లావోస్‌ ప్రధాని సిసౌలిత్‌తో సమావేశం సందర్భంగా ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహభావం, సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో ఆర్థిక సహకారం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తించారు. చైనాకు దీటుగా భారత్‌ కూడా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని వారు కోరినట్లు విదేశంగా శాఖ తూర్పు విభాగం కార్యదర్శి ప్రీతి సరణ్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు