ఐరాసకు ఇది పునర్జన్మ: మోదీ

18 Jul, 2020 04:35 IST|Sakshi

ఐక్య రాజ్య సమితి: కరోనా మహమ్మారి ఐక్య రాజ్య సమితి పునర్జన్మకు, పునర్నిర్మాణానికి అవసరమైన సందర్భాన్ని అందించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్యసమితి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ భేటీలో వీడియో లింక్‌ ద్వారా పాల్గొన్నారు. ఐరాస ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

మావన కేంద్రిత నాగరికత దిశగా సరికొత్త అడుగులను ఐరాస వేయాలంటూ ఆకాంక్షించారు. దేశాలు పెరుగుతున్న కొద్దీ సంస్థపై అంచనాలు కూడా పెరుగతున్నాయని అన్నారు. బహుదేశీయ విధానం ద్వారా ప్రపంచంలో సుస్థిరమైన శాంతి, అభివృద్ధి పెరుగుతాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మానవ లక్ష్యాలను అందుకునేలా 75వ యానివర్సరీకి ఐరాస తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. రెండవప్రపంచ యుద్ధం ఐరాస పునాదికి నాంది పలికిందని, కోవిడ్‌ మహమ్మారి ఐరాస పునర్నిర్మాణానికి పునాది కావాలని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ శాంతికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో కలసి పని చేస్తున్నట్లు చెప్పారు. సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదాలతో పాటు భారతీయ వైద్య మూలాలతో నేడు ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా నుంచి కోలుకుంటున్న దేశంగా భారత్‌ నిలిచిందని అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలను తెరిపించామని, భారీ స్థాయిలో ఆయుష్మాన్‌ భారత్‌ చేపట్టినట్లు గుర్తుచేశారు. 2022 నాటికి ప్రతి భారతీయుడు ఇల్లు కలిగి ఉండాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

>
మరిన్ని వార్తలు