గాంధీ కోసం ‘ఐన్‌స్టీన్‌ చాలెంజ్‌’

3 Oct, 2019 04:10 IST|Sakshi

గాంధీజీ జయంతి సందర్భంగా ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’లో మోదీ నివాళి వ్యాసం

న్యూయార్క్‌: ప్రపంచంలో ద్వేషం, హింస, బాధలను అంతం చేసేందుకు భుజం, భుజం కలిపి నడుద్దామని విశ్వ మానవాళికి మోదీ పిలుపునిచ్చారు. గాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ను ఉటంకిస్తూ.. ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడు, కష్టాలను తీర్చేవాడు, అహంకారం లేనివాడే నిజమైన మానవుడని ఆ భక్తిగీతం అర్థమని వివరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ద న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ‘భారత్‌కు, ప్రపంచానికి గాంధీ ఎందుకు కావాలి?’ శీర్షికతో మోదీ ఒక వ్యాసం రాశారు.

మహాత్ముడిని అత్యుత్తమ గురువని, దారి చూపే వెలుగని, ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని విశ్వసించే లక్షలాది మందికి ఆయనే ధైర్యమని అందులో ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘ఐన్‌స్టీన్‌ చాలెంజ్‌’ను మోదీ తెరపైకి తెచ్చారు. ‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్‌ తరాలు విశ్వసించవేమో’అని మహాత్మాగాంధీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చేసిన ప్రశంసను ప్రస్తావిస్తూ.. ‘గాంధీకి నివాళిగా, ఐన్‌స్టీన్‌ చాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నాను. గాంధీ ఆశయాలను ముందు తరాలకు ఎలా అందించగలం? అనేది అంతా ఆలోచించాలి. వినూత్న విధానాలు, ఆవిష్కరణల ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే విషయమై మేధావులు, టెక్‌ లీడర్లు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు కృషి చేయాలి’అని మోదీ కోరారు.

గాంధీ ఆశయాల సాధన కోసం తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘భారత జాతీయతావాదం భారత్‌కు మాత్రమే పరిమితమైన సంకుచిత వాదం కాదని, విశ్వ మానవాళి సంక్షేమాన్ని కోరే వాదమని గాంధీజీ బలంగా నమ్మారు’అని మోదీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన అంతం కావడం ఒక్కటే కాదని, రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత అందులో ఇమిడి ఉన్నాయన్నారు. ‘ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించే ప్రపంచాన్ని ఆయన కలగన్నారు. పేదల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని అంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ భూమిపై నివసిస్తున్న మనం అవని సంక్షేమానికి, దానిపై ఉన్న వృక్ష, పశు, పక్ష్యాది సమస్త ప్రాణుల సంక్షేమానికి బాధ్యులుగా ఉండాలి’అని పిలుపునిచ్చారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా