‘ప్రత్యేక భాగస్వామ్యం’ మనది

22 May, 2018 03:13 IST|Sakshi
సోమవారం సోచిలో ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్న పుతిన్‌

పుతిన్‌తో ఫలప్రదంగా చర్చలు: ప్రధాని మోదీ

రష్యాలోని సోచిలో అనధికారిక భేటీ

ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహం: పుతిన్‌

సోచి: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయని, ఇది ఇరు దేశాలు సాధించిన భారీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు నాటిన వ్యూహాత్మక భాగస్వామ్యమనే విత్తనాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌తో చర్చలు విజయవంతంగా సాగాయని, భారత్‌–రష్యాల మధ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ తెలిపారు.  రష్యాలోని నల్లసముద్ర తీరప్రాంత నగరమైన సోచిలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మోదీ అనధికారికంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని పుతిన్‌ ఆహ్వానిస్తూ.. మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపైనే ఎక్కువ సమయం చర్చించారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, అఫ్గానిస్తాన్, సిరియాల్లో పరిస్థితి, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న ఎస్‌సీవో, బ్రిక్స్‌ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ల మధ్య చర్చ జరిగింది.  

పుతిన్‌కు ప్రత్యేక స్థానం: మోదీ
భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి రష్యాలో పర్యటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యాక కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు పుతిన్‌. నా రాజకీయ జీవితంలో పుతిన్, రష్యాలకు ప్రత్యేక స్థానం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, రష్యాలు ఎప్పటినుంచో మిత్రదేశాలు., ఆ రెండింటి మధ్య ఇంతవరకూ విభేదాలు లేని మైత్రి కొనసాగింది. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ సంబంధాల్లో ఈ అనధికారిక భేటీ ఒక కొత్త కోణం. దీనిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. భారత్, రష్యాల మధ్య సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా గత 18 ఏళ్లలో అనేక అంశాలపై పుతిన్‌తో చర్చించే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ను అభినందించారు. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు చరిత్రాత్మక స్థాయికి చేరాయని మోదీ ప్రశంసిం చారు. సోచిలో బొకారెవ్‌ క్రీక్‌ నుంచి ఒలింపిక్‌ పార్కు వరకూ ఇరువురు బోటు షికారు చేశారు.

ఇరు దేశాలకు ప్రయోజకరంగా..:  రష్యా
సోమవారం నాటి చర్చలు చాలా ఉత్సుకతతో, ఇరు దేశాలకు ఉపయోగకరంగా సాగాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్‌రోవ్‌ను ఉద్దేశించి ఆ దేశ అధికారిక వార్తాపత్రిక టాస్‌ పేర్కొంది. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా–భారత్‌ మధ్య సైనిక సహకారంపై చర్చలు జరుగుతాయని పెస్కోవ్‌ చెప్పారు. రష్యా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి భారత్‌కు పయనమయ్యారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పుతిన్‌ వీడ్కోలు పలికారు.   
 

మరిన్ని వార్తలు