ఖతార్‌లో భారత కార్మికులను పట్టించుకోని మోదీ

6 Jun, 2016 14:49 IST|Sakshi
ఖతార్‌లో భారత కార్మికులను పట్టించుకోని మోదీ

దోహ: ఖతార్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఓ కార్మిక శిబిరంలో పాల్గొన్నారు. ‘స్మైల్స్ అండ్ సాక్స్’ అంటూ అక్కడి నుంచి ట్వీట్ కూడా చేశారు. కానీ అక్కడ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న భారతీయ కార్మికుల ప్రయోజనాల గురించి ఖతార్ రాజకీయ నాయకత్వంతో ఒక్క మాట కూడా చర్చించక పోవడం విచారకరం. కార్మిక సంస్కరణలను తీసుకొస్తామంటూ ఖతార్ ఎమిర్ సంయుక్త పత్రికా ప్రకటనలో పేర్కొనగా ఇంతమంది భారతీయులకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు మాత్రం మోదీ తెలిపారు.

గల్ఫ్ దేశమైన ఖతార్‌కు వె ళ్లడమంటే చమురు, సహజవాయువు లాంటి వ్యాపార ఒప్పందాల గురించి చర్చించడం ఎంత ముఖ్యమో, భారతీయ కార్మికుల ప్రయోజనాల కోసం అక్కడి కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకరావాలని డిమాండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికీ ఖతార్ పాతకాలం నాటి బానిస చట్టాలే అమలవుతున్నాయి. తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయించుకుంటారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగం మానేసి స్వదేశానికి వద్డామన్నా కుదరదు. కంపెనీల యజమాన్యం బలవంతంగా పంపిస్తే తప్పా భారత్ తిరిగి రావడానికి అక్కడి చట్టాలు అనుమతించవు.

 అక్కడి వేడి వాతావరణం, పని ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది భారతీయ కార్మికులు మరణిస్తూ ఉంటారు. 2022లో జరుగనున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం నిర్మిస్తున్న స్టేడియం పనుల్లో దాదాపు 1200 మంది భారతీయ కార్మికుల మరణించారంటే ఆశ్చర్యం వేస్తుంది. స్టేడియం నిర్మాణం పూర్తయ్యేలోగా మరో నాలుగువేల మంది కార్మికులు మరణించే ప్రమాదం కూడా ఉందట. అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఐటీయుసీ)యే ఈ వివరాలను వెల్లడించింది.

గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాల్లో దాదాపు 70 లక్షల మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా అక్కడ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇటీవల చమురు ధరలు పడిపోవడం వల్ల పలు కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించి వందలాది భారతీ కార్మికులను వెనక్కి పంపించాయి. చమురు, సహజవాయువు కోసం భారత్ ఎక్కువగా గల్ఫ్ దేశాల కంపెనీలపై ఆధారపడుతుండడం వల్ల భారత కార్మికుల ప్రయోజనాల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకన్న దాఖలాలు లేవు. ఇప్పుడు నరేంద్ర మోదీ అక్కడి కార్మికుల శిబిరంలో భారతీయ కార్మికులతో ముచ్చటించడమే కాకుండా వాటి ఫొటోలను ట్వీట్ చేసిన నేపథ్యంలో కార్మికుల పరిస్థితి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా