మాల్యా, లలిత్‌లను అప్పగించండి

9 Jul, 2017 00:52 IST|Sakshi
మాల్యా, లలిత్‌లను అప్పగించండి

బ్రిటన్‌ ప్రధానిని కోరిన మోదీ
జీ–20 సదస్సులో భాగంగా థెరిసా మేతో ప్రత్యేక భేటీ
► మలబార్‌ విన్యాసాలపై జపాన్‌ ప్రధానితో సమీక్ష 
► పలు దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు


హాంబర్గ్‌: భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి భారత్‌కు రప్పించటంలో సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీ–20 సదస్సులో భాగంగా బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో భేటీ సందర్భంగా మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా, ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీలను భారత్‌ రప్పించటంలో సహకరించాలని కోరారు.

భారత బ్యాంకుల్లో రూ.9వేలకోట్ల రుణాలు తీసుకుని గతేడాది మార్చిలో మాల్యా లండన్‌ పారిపోయారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంటులనుంచీ తప్పించుకుంటున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో విచారణ జరుగుతున్న ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీనీ అప్పగించాలని థెరిసా మేను మోదీ కోరారు. ఉగ్రవాదంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జీ–20 సదస్సులో భాగంగా పలుదేశాల అధినేతలతో ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

‘మలబార్‌’పై సమీక్ష: భారత్‌–జపాన్‌ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న మలబార్‌ సైనిక విన్యాసాలపై ఇరుదేశాల ప్రధానులు మోదీ, షింజో అబేలు చర్చించారు.  ద్వైపాక్షిక సంబంధాలపైనా వీరిమధ్య చర్చ జరిగింది. జపాన్‌ సాయం చేస్తున్న  ప్రాజెక్టుల పురోగతిపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు
భారత జాతీయ పెట్టుబడులు, మౌలికవసతుల నిధిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని నార్వేను  మోదీ కోరారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బర్గ్‌తో జరిగిన భేటీలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ ఇన్, ఇటలీ ప్రధాని పాలో జెంటిలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషి యోతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. వియత్నాం ప్రధాని ఎన్‌గుయెన్‌ ఫుక్, సెనెగల్‌ అధ్యక్షుడు మేకీ సాల్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.

మోదీ ‘ఉగ్ర’ ప్రకటనకు భారీ స్పందన
జీ–20 సదస్సులో ఉగ్రవాదంపై మోదీ చేసిన ప్రసంగంపై సభ్యదేశాల్లో సానుకూల స్పందన కనిపించిందని భారత్‌ వెల్లడించింది. జర్మన్‌ చాన్సెలర్‌ మెర్కెల్‌ సహా యూరోపియన్‌ నేతలు మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారని భారత్‌ తెలిపింది. ఉగ్రవాద సంస్థలతోపాటుగా ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సాయం చేస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించే విషయంలో సంయుక్తంగా ముందుకెళ్లేందుకు మెజారిటీ దేశాలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. జీ–20 సదస్సు పూర్తవటంతో ప్రధాని మోదీ భారత్‌ తిరుగుప్రయాణమయ్యారు.

‘మాటల్లో చెప్పలేనిది ఫొటో చెబుతుంది’
మోదీ, జిన్‌పింగ్‌ చర్చలపై భారత్‌
హాంబర్గ్‌: మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా జరిపిన అనధికారిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత్‌ నిరాకరించింది. వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించారని, అంతకుమించి చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే తెలిపారు. మోదీ, జిన్‌పింగ్‌ నవ్వుతూ తీయించుకున్న ఫొటో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న  సరిహద్దు ఉద్రిక్తత తొలగిందనడానికి నిదర్శనమా అని విలేకర్లు అడగ్గా.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. ఫొటో విషయానికి వస్తే.. వెయ్యిమాటల్లో చెప్పలేనిది ఒక ఫొటో చెబుతుంది అన్న నానుడి ఉండనే ఉంది’ అని బదులిచ్చారు. 

మరిన్ని వార్తలు