చైనా మద్దతుతోనే ఓలీ భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు

15 Jul, 2020 15:03 IST|Sakshi

ఓలీ వ్యాఖ్యలపై పై నేపాల్‌ విదేశాంగ శాఖ వివరణ

ఖాట్మండు : శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య పరిస్థితి ఉద్రిక్తతంగా ఉన్న సమయంలో ఓలీ తన వ్యాఖ్యలతో పరిస్థితులను మరింత క్షీణింపచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓలీ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌, విదేశాల్లోనే కాక స్వదేశంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓలీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ప్రధాని కేపీ ఓలీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఒక్క రాముడేంటి, అన్ని గ్ర‌హాలు నేపాల్‌వే..)

‘ఒక ప్రధాని ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ప్రధాని ఓలీ భారత్-నేపాల్ సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్నట్టు ఉందని’ అన్నారు. నేపాల్‌లో భారత వ్యతిరేక భావాలు పెంచడం కోసమే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్‌ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్  కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఓలీ వ్యాఖ్యలు నేపాల్-ఇండియా సంబంధాలను, రెండు దేశాల ప్రజలు, నాయకుల మధ్య సంబంధాలను చెదిరిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారని రాసుకొచ్చింది. 

ఓలీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నేపాల్‌ విదేశాంగ శాఖ వివరణ జారీ చేసింది. నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేపీ శర్మ ఓలీ ఈ విధంగా మాట్లాడారని.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏ రాజకీయ దురుద్దేశం లేదని తెలిపింది. రాముడి కాలానికి సంబంధించిన ప్రాంతాలపైన చాలా అపోహలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో రాముడు, రామాయణం కాలానికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలన్న అంశాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారని వివరించింది. (చైనా మెప్పు కోసమే ఆ వ్యాఖ్యలు..)

కాగా, భారత్, నేపాల్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 20న నేపాల్ తన కొత్త మ్యాప్ జారీ చేసింది. అందులో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ప్రస్తుతం భారత్‌లో ఉన్నాయి. కానీ అది తమ ప్రాంతం అని నేపాల్ చెబుతోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దీని గురించి నేపాల్‌తో చర్చించేది లేదని తేల్చిచెప్పింది. ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలకై కృషి చేస్తామని పేర్కొన్నది. గత కొద్ది కాలంగా ఓలీ భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చైనా అండ చూసుకునే ఓలీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు