పాక్‌ అధ్యక్ష ఎన్నిక రసవత్తరం!

23 Aug, 2018 05:10 IST|Sakshi

బరిలో పీపీపీ, పీఎంఎల్‌–ఎన్‌ల ఉమ్మడి అభ్యర్థి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ అధ్యక్షుడి ఎన్నికలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ)తో ఉమ్మడిగా తలపడాలని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నిర్ణయించాయి. సెప్టెంబర్‌ 4న జరిగే ఈ ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ మీడియా వెల్లడి ంచింది. ముర్రేలో ఆగస్టు 25న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో అభ్యర్థిని ప్రకటి ంచనున్నట్లు తెలిసింది. ఆ సమావేశానికి పీఎం ఎల్‌–ఎన్‌ చీఫ్‌ షాబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షత వహిం చనున్నారు. తొలుత ఇత్‌జాజ్‌ అహసన్‌ను పీపీపీ అభ్యర్థిగా నిర్ణయించగా.. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ప్రకటించారంటూ పీఎం ఎల్‌–ఎన్‌ తిరస్కరించింది.

ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని, పీఎంఎల్‌–ఎన్‌ నేత నవాజ్‌ షరీఫ్, ఆయన భార్య కుల్సుమ్‌కు వ్యతిరేకంగా అహసన్‌ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపితే ఎన్నిక రసవత్తరంగా మారుతుందని.. పీటీఐ, ప్రతిపక్షాల మధ్య 8–10 ఓట్ల తేడానే ఉంటుందని సీనియర్‌ పీఎంఎల్‌–ఎన్‌ నేత అన్నారు. పీటీఐ ఇప్పటికే ప్రముఖ డెంటిస్ట్‌ అరీఫ్‌ అల్వీ (69)ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 9న ముగియనుంది. పరోక్ష పద్ధతిలో జరిగే పాక్‌ అధ్యక్షుడి ఎన్నికలో పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు పాల్గొంటారు.

మరిన్ని వార్తలు