ఎన్నికల వేళ పాక్‌లో ఊహించని పరిణామాలు

22 Jul, 2018 13:45 IST|Sakshi

రావల్పిండి : పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)కు చెందిన నేతలకు పలు కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు వెలువడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో అడుగుపెట్టిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను పాక్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు హనీఫ్‌ అబ్బాసీకి జీవిత ఖైదు విధిస్తూ సీఎన్‌ఎస్‌ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రావల్పిండిలోని పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ముందర ఆందోళనకు దిగారు. 

పాక్‌ ఆర్మీ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ(ఇంటర్ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల్లో తాము అనుకున్న వారిని గెలిపించుకోవడానికి ఐఎస్‌ఐ  పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం వెనుక పాక్‌ ఆర్మీ హస్తం ఉందని విమర్శించారు. యూఎస్‌ కూడా పాక్‌ ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

వారం రోజుల క్రితం ఇస్లామాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఐఎస్‌ఐ మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్‌ చేస్తుందని అన్నారు. రావల్పిండి బార్‌ అసోసియేషన్‌ కూడా ఐఎస్‌ఐపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చేలా న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. షరీఫ్‌, మరియమ్‌ కేసుల్లో కూడా అలానే జరిగిందని అన్నారు. కాగా పాక్‌ మాజీ క్రికెటర్‌, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్‌ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ సమాఖ్య భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్‌ ఖలీల్‌ కూడా పీటీఐ పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు