అమెరికాలో కాల్పుల మోత..

29 May, 2017 01:06 IST|Sakshi
అమెరికాలో కాల్పుల మోత..

8 మంది మృతి
బ్రూక్‌హవెన్‌: కాల్పుల మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. మిసిసిపీ రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. మిసిసిపీ పోలీసు అధికారి వారెన్‌ స్ట్రైన్‌ కథనం ప్రకారం... లింకన్‌ కౌంటీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్రూక్‌హవెన్, బొగ్యు చిట్టొల్లో  ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పిల్లల విషయమై భార్య, ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డ కోరీ గాడ్‌బోల్ట్‌(35) ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పులు చోటుచేసుకున్న మూడిళ్లలో దర్యాప్తు బృందాలు సాక్ష్యాధారాల్ని సేకరిస్తున్నాయని ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని స్ట్రైన్‌ చెప్పారు.

అరెస్టు అనంతరం గాడ్‌బోల్ట్‌ స్థానిక పత్రికతో మాట్లాడుతూ.. ‘నా భార్య, ఆమె సవతి తండ్రి, తల్లితో పిల్లల్ని తీసుకెళ్లే విషయమై మాట్లాడుతున్నా.. ఇంతలో ఎవరో పోలీసు అధికారికి ఫోన్‌చేశారు. సంబంధం లేని వారు జోక్యం చేసుకున్నారు. ఈ పనికి పాల్పడ్డాక నేను బతకడానికి అనర్హుడిన’ని పేర్కొన్నాడు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మిసిసిపి రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ బ్రైంట్‌ విచారం వ్యక్తంచేశారు. మిసిసిపీ రాజధాని జాక్సన్‌ను కాల్పులు జరిగిన ప్రాంతం 109 కి.మి. దూరంలో ఉంది.

మరిన్ని వార్తలు