ఐఫోన్‌ను చూసి గన్‌ అనుకుని ...

23 Mar, 2018 14:13 IST|Sakshi

కాలిఫోర్నియా : చీకట్లో ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలోని సెల్‌ఫోన్‌ను తుపాకీగా భావించి, ఆ వ్యక్తిపై 20సార్లు కాల్పులు జరిపి చంపిన ఘటన కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్టీఫెన్‌ అలోంజో క్లార్క్‌ (22)  సాక్రమెంట్‌లో ఉంటున్న తన తాతగారింటికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తాతకు సాయం చేయడానికి క్లార్క్‌ ప్రతివారం వస్తుంటాడు. ఎప్పటి మాదిరిగానే మరోసారి వచ్చి రాత్రి  తన సెల్‌ఫోన్‌ను తీసుకుని ఇంటి వెనక పెరట్లో తిరుగుతున్నాడు.

అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు అతడు సరిగా కనిపించకపోవడంతో నేరస్తుడని అనుమానించారు. నిఘా కోసం ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌లోకానీ, కెమెరాల్లో కానీ క్లార్క్‌ చేతిలో ఉన్న వస్తువును సరిగా గుర్తించలేకపోయాయి. దాంతో అతని చేతిలో ఉన్నది తుపాకీనే అని అనుమానంతో క్లార్క్‌ పై కాల్పులు జరిపారు. అనంతరం అతడి దగ్గరకు వెళ్లి చూడగా అతని చేతిలో ఉన్నది ఆపిల్‌ ఐఫోన్‌ అని తెలిసింది. ఈ తతంగం అంతా వారి వద్ద ఉన్న కెమారాల్లో రికార్డు అవుతూనే ఉంది. మరణించిన వ్యక్తి దగ్గర ఉన్నది గన్‌ కాదని తెలియగానే పోలీసులు కెమరాను మ్యూట్‌లో పెట్టారు. రెండు నిమిషాలపాటు వారి సంభాషణ అంతా మ్యూట్‌లోనే రికార్డయ్యింది.

ఈ విషయం గురించి పోలీసు అధికారులను ప్రశ్నించగా భిన్న కథనాలు చెప్పుకొచ్చారు. చనిపోయిన వ్యక్తి అంతకుముందు అక్కడ ఉన్న మూడు వాహనాలను ధ్వంసం చేశాడని, దాంతో  పక్కింటివారు 911 నెంబరుకు ఫోన్‌ చేస్తేనే తాము అక్కడకి వచ్చామని చెప్పారు. క్లార్క్‌ తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడని, అందులో భాగంగా పక్క ఇంటి వారి కిటికి అద్దాలను కూడా పగలకొట్టాడన్నారు. మరో అధికారి మాట్లాడుతూ కెమరాలో రికార్డయిన దృశ్యాల్లో అతని ఎడమ చేతిలో ఉన్నవస్తువును సరిగా కనిపించలేదని, దాంతో అతని చేతిలో ఉన్నది మరణాయుధం అని భావించి కాల్పులు జరిపామని చెప్పారు. తొలుత అధికారులు అతని వివరాలను వెల్లడించలేదు. కానీ సాలెనా మన్ని అనే యువతి అతని పేరు స్టీఫెన్‌ అలోంజో క్లార్క్‌ అని, తాను అతడికి కాబోయే భార్యనని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపింది. అతని సహచరులు, బంధువులు క్లార్క్‌ మృతికి పోలీసులే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు