మేడమ్‌ క్యూరీ కూతురిని చంపినట్టుగా.. 

7 Nov, 2019 15:06 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ - ఎన్‌ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌(69) శరీరంలో పోలోనియమ్‌ అనే రేడియో ధార్మిక మూలకాన్ని ఇంజెక్ట్‌ చేశారని ఎమ్‌క్యూఎమ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్‌ హుస్సేన్‌ గురువారం ఆరోపించారు. పోలోనియమ్‌ అనే రసాయనం నెమ్మది నెమ్మదిగా విషంగా మారుతుందని తెలిపారు. పాలస్తీనా ఉద్యమ కారుడు యాసిర్‌ ఆరాఫత్‌ను 2004లో ఇలాగే చంపేశారని తెలిపారు. అలాగే రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న మేడమ్‌ క్యూరీ కూతురు, నోబెల్‌ గ్రహీత ఇరెనె జోలియట్‌ క్యూరీని కూడా 1956లో ఇలాంటి విషమే ఇచ్చి చంపేశారని ఉదాహరణగా చూపించారు.

ఈ విషాన్ని అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్రత్యేక ప్రయోగ శాలల్లో మాత్రమే కనుగొనగలమని తెలిపారు. పోలోనియమ్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట అది రక్త కణాలను నాశనం చేస్తుంది. తర్వాత డీఎన్‌ఏపై దాడి చేసి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అనంతరం లివర్‌, కిడ్నీ, ఎముక మజ్జలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. పోలోనియమ్‌ రసాయనం గురించి, దాని దుష్ప్రభావాల గురించిన పరిశోధనాత్మక ఆర్టికల్‌ను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అల్‌ అజీజియా కేసులో లాహోర్‌లోని కోట్‌ లక్‌పత్‌ జైల్లో  ఏడేళ్ల ఖైదును అనుభవిస్తున్న నవాజ్‌ షరీఫ్‌ను అక్టోబర్‌ 22న అనారోగ్య కారణాల వల్ల లాహోర్‌లోని సిమ్స్‌ (సర్వీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు.

ఈ కారణాలతో కోర్టు నవాజ్‌కు అక్టోబరు 29న బెయిల్‌ మంజూరు చేసింది. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడకముందే ఆయనను బుధవారం తన స్వగృహం జతి ఉమ్రాకు తరలించారు. ప్రస్తు​తం ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్‌ ఖాన్‌ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటలు ఆయన్ను డాక్టర్లు కనిపెట్టుకుని ఉంటారు. ఇందుకోసం ఆయన ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు చేశారు. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదముండడంతో కుటంబసభ్యులను తప్ప బయటి వారిని ఎవ్వరినీ కలవనివ్వటం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మర్రియుమ్‌ ఔరంగజేబ్‌ ప్రజలకు తెలియజేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా