పేరెంట్స్‌కన్నా పేదోళ్లు ఈ తరం పిల్లలు

27 Dec, 2016 19:41 IST|Sakshi
పేరెంట్స్‌కన్నా పేదోళ్లు ఈ తరం పిల్లలు

న్యూయార్క్‌: రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అభివృద్ధి చెందిన దేశాల్లో తాత ముత్తాతలు, తల్లిదండ్రలు కన్నా పిల్లలు ఎక్కువగా సంపాదిస్తూ వచ్చారు. 1993 నుంచి 2005 వరకు ఆ తరం ఆదాయాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 98 శాతం మంది ఆదాయం ఏటా పెరుగుతూ వచ్చింది. ఈ ట్రెండ్‌ కనీసం 25 అభివృద్ధి చెందిన దేశాల్లో స్పష్టంగా కనిపించింది. 2005 నుంచి 2014 సంవత్సరాల మధ్య నవతరం ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

70 శాతం ఈ తరం ఇళ్లలో తాతముత్తాతలు, తల్లిదండ్రులకన్నా ఆదాయం ఉన్న చోట ఆగిపోవడంగానీ, తగ్గిపోవడంగానీ జరుగుతోంది. ఈ ప్రతికూల పరిణామాన్ని కొంతమేరకైనా తగ్గిద్దామనే ఆలోచనతో కొన్ని దేశాల ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే రాయితీలను కూడా పెంచాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఇటలీ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. 2005 నుంచి 2014 మధ్య ఇటలీలో 97 శాతం మంది ఆదాయం నిలకడగా ఉండడంగానీ, పడిపోవడంగానీ జరగ్గా, ఆదాయం పన్ను రాయితీల అనంతరం వారి శాతం నూటికి నూరు శాతం చేరుకుంది.

అమెరికాలో ఈ ట్రెండ్‌ వైవిధ్యంగా ఉంది. ఇదే కాలానికి 80 శాతం ఈ తరం అమెరికన్ల ఆదాయం నిలకడగా, లేదా పడిపోగా పన్ను రాయితీల వల్ల వారందరి ఆదాయం పెరిగింది. దీనికి కారణం 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం ఒక కారణంకాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యత్యాసం బాగా పెరగడం, అంటే కొంత మంది వద్దనే ఆదాయం ఎక్కువగా పోగవడం మరో కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

లేబర్‌ మార్కెట్‌లో వయసుమీరిన వారు కూడా ఎక్కువవడం కూడా కారణమని వారంటున్నారు. ఏదేమైనా ‘మ్యాక్‌కిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌’ విడుదల చేసిన ఈ ఆర్థిక విశ్లేషణలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై చర్చించే అవకాశం వచ్చిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు