-

మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన జరగాలి

26 Dec, 2016 02:52 IST|Sakshi
వాటికన్‌ సిటీలో జరిగిన క్రిస్మస్‌ ఉత్సవాల్లో బాలయేసు విగ్రహాన్ని ముద్దాడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌.

పోప్‌ ఫ్రాన్సిస్‌ క్రిస్మస్‌ సందేశం
ఉగ్రదాడి మృతులకు సంతాపం
ప్రపంచవ్యాపంగా ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు


వాటికన్‌ సిటీ/న్యూఢిల్లీ: జీహాదీల దాడులతో రక్తసిక్తమ వుతున్న మధ్య ప్రాచ్య దేశాల్లో శాంతి స్థాపన నెలకొనాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆకాంక్షించారు. ఉగ్రవాదుల కిరాతక దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టు డుకుతున్న సిరియాలో తుపాకులు నిశ్శబ్ధంగా మారాలని ఆదివారం ఇక్కడ ఇచ్చిన తన క్రిస్మస్‌ సందేశం లో పిలుపునిచ్చారు. నలభై వేల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం లో పోప్‌ భావోద్వేగంతో ప్రసంగించారు. చరి త్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే దిశగా అడుగులు వేయాలని ఇజ్రాయిల్, పాలస్తీని యన్లకు సూచించారు. 

కాగా, బెర్లిన్‌ క్రిస్టమస్‌ మార్కె ట్‌పై ఐసిస్‌ ట్రక్‌ దాడిలో 12 మంది మర ణించిన నేపథ్యంలో యూరప్‌ అంతటా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మిలాన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఈ దాడుల అను మానితుడు అనిస్‌ అమ్రి హతమయ్యాడు. ఫ్రాన్స్‌లో జీహాదీ ట్రక్కు దాడిలో 86 మంది బలైన దారుణం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు వణుకుతు న్నారు. దీంతో ప్రభుత్వం 91 వేల మంది భద్రతా సిబ్బందిని జనసమ్మర్థ ప్రాంతాలు, మార్కెట్‌లు, చర్చిల వద్ద నియమించింది.క్రైస్తవ మత పెద్దలు తమ సందేశాల్లో... యుద్ధం, దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.

బెత్లెహామ్‌లో ఘనంగా వేడుక
క్రీస్తు జన్మస్థానం బెత్లెహామ్‌లోని చర్చ్‌ ఆఫ్‌ నేటివిటీ భక్తులతో కళకళలాడింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. గత ఏడాది పాలస్తీనియన్లు ఇజ్రాయలీలపై కత్తులతో దాడులు చేసిన క్రమంలో... ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆనందంగా సంబరాల్లో పాల్గొన్నారు.  అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాల్లో క్రీస్తు జన్మదిన వేడుక ఆడంబరంగా సాగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులు వైట్‌హౌస్‌ నుంచి తమ చివరి క్రిస్మస్‌ సందేశాన్నిచ్చారు.

భారత్‌లో అర్ధరాత్రి నుంచే వెలుగులు
శనివారం అర్ధరాత్రి నుంచే భారత్‌లో క్రిస్మస్‌ వెలుగులు విరజిమ్మాయి. చర్చిలు విద్యుత్‌ కాంతులతో మిరిమిట్లు గొలిపాయి. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు పండగ సంబరాల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు