విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు

22 Feb, 2016 13:51 IST|Sakshi
విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు

విధ్వంసకర విన్‌స్టన్ తుఫానుతో ఫిజి పౌరులు నిరాశ్రయులయ్యారు. తుఫాను బీభత్సంతో అతలాకుతలమైన ఆ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఫిజి ద్వీపంలో చెలరేగిన శక్తివంతమైన తుఫాను వల్ల సుమారు 20 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఫిజి తుఫాను సృష్టించిన బీభత్సం  ప్రాణ నష్టంతో పాటు... తీవ్ర ఆస్తి, పంట నష్టాన్ని తెచ్చిపెట్టింది. పునరావాస కేంద్రాల్లోని తుఫాన్ బాధితులకు తిరిగి ఆశ్రయం కల్పించే పనులు ప్రారంభించినట్లు ఫసిఫిక్ పశ్చిమ డివిజన్ అధిపతి తెలిపారు. మరో ఐదు రోజుల్లో బాధితులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కమిషనర్ మానస చెప్పారు.

ఫిజి ద్వీపాల్లోని తుఫాను బాధిత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ప్రధాన ద్వీపమైన విటి లెవుతో సహా  పవర్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. తుఫాను కారణంగా ఫిజి ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ను సోమవారం ఎత్తివేసినప్పటికీ... తక్షణ పునరుద్ధరణ పనులకోసం 30 రోజులపాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రాథమిక సాయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫిజికి 5 మిలియన్ డాలర్ల సాయాన్నిఅందించింది. గృహాలను కోల్పోయిన తుఫాన్ బాధితులకు ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి తక్షణ సాయం అందించేందుకు ఆ నిధులను వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జూలీ బిషప్ చెప్పారు. ఫిజినుంచీ వర్జిన్ ఆస్ట్రేలియా, ఎయిర్ న్యూజిల్యాండ్, ఫిజి ఎయిర్వేస్ విమానాలను ఇప్పటికే పునరుద్ధరించాయని, అయితే జెట్ స్టార్ మాత్రం మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.  

తుఫాను వల్ల ఫిజి సందర్శకులకు ఎటువంటి ముప్పు లేదని, వారంతా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని ఫిజి టూరిజం మంత్రి ఫయాజ్ సిద్ధిక్.. ప్రభుత్వ ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 'విటి లెవు' ప్రాంతంలో అత్యధికంగా ఉన్న హోటళ్లకు ఎటువంటి నష్టం జరగలేదని, మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు