ఒకటి వచ్చేసింది.. ఇంకోటి రాబోతోంది

16 Oct, 2016 02:55 IST|Sakshi
క్రొయేషియా కంపెనీ తయారు చేసిన టూ వీలర్.. ‘గ్రిప్’.

ఎవరు అవునన్నా... ఎవరు కాదన్నా... పెట్రోలు, డీజిల్ కార్లకు త్వరలోనే కాలం చెల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటి స్థానాన్ని విద్యుత్తుతో నడిచే వాహనాలు తీసుకోవడమూ అంతే నిజం. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఫొటోలో కనిపిస్తున్న వాహనాలు. ఒకటేమో ద్విచక్ర వాహనం మరోటి నాలుగు చక్రాల బండి. కరెంటుతో నడవడం రెండింటిలోనూ కామన్ అంశం. అంతేకాదు... బైక్ మాదిరిగా కనిపిస్తోంది చూశారూ... అదేమో ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 242 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. యూరప్‌లోని క్రొయేషియా కంపెనీ రిమాక్ తయారు చేసిన ఈ బైక్ పేరు గ్రిప్. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల గ్రిప్‌లో దాదాపు మూడు కిలోవాట్స్ (గంటకు) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగని ఛార్జింగ్‌కు ఎక్కువ సేపు పట్టదు. కేవలం 80 నిమిషాల్లో పూర్తిస్థాయిలో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి దీని ఖరీదు మాత్రం కొంచెం ఎక్కువే. డిమాండ్ పెరిగితే తగ్గే అవకాశం లేకపోలేదు. ఇక పక్కనున్న బుల్లి కారు వివరాలు చూద్దాం. ఇది స్వీడన్‌లో తయారైంది. పేరు యూనిటి. దీని స్పీడెక్కువ. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇద్దరు హాయిగా కూర్చునేంత స్థలం ఉంటుంది దీంట్లో. ఇంకో విశేషం ఏమిటంటే... దీని విండోస్క్రీన్ టీవీ తెరగానూ పనిచేస్తుంది. దాదాపు 400 కిలోల బరువుండే యూనిటీలో 15 కిలోవాట్ల ఏసీ మోటర్ ఉంటుంది. మరో రెండేళ్లలో అంటే... 2018లో అందుబాటులోకి రానుంది.


 

మరిన్ని వార్తలు