‘ఆ ప్రాంతాలను భారత్‌ నేపాల్‌కు అప్పగించాల్సిందే’

28 May, 2020 16:20 IST|Sakshi

నేపాల్‌ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్‌ గ్యావాలి

ఖాట్మండూ: కాలాపానీ ప్రాంతంలో మోహరించిన భద్రతా బలగాలను భారత్‌ వెంటనే వెనక్కి పిలిపించాలని నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ గ్యావాలి విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన వివాదాన్ని వెంటనే పరిష్కరించుకునేలా చర్చలకు సిద్ధమవ్వాలని కోరారు. ‘‘సుగౌలీ ఒప్పంద స్ఫూర్తిని భారత్‌ గౌరవించాలని కోరుకుంటున్నాం. కాలాపానీ వద్ద మోహరించిన బలగాలను భారత్‌ ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతాలను తిరిగి నేపాల్‌కు అప్పగించాలి. నేపాల్‌ భూభాగంలో రహదారి నిర్మాణం చేపట్టడం వంటి ఏకపక్ష చర్యలను మేం ఎంతమాత్రం ఉపేక్షించబోమని పునరుద్ఘాటిస్తున్నా. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభానికి ముందే ఈ విషయం గురించి భారత్‌తో చర్చలు జరపాలని భావించామని.. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ప్రదీప్‌ చెప్పుకొచ్చారు. (మ్యాపుల వివాదం.. నేపాల్‌ ప్రధానికి షరతులు!)

ఆ విషయాన్ని నిరూపించగలం
ఇక 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న సుగౌలీ ఒప్పందాన్ని 21వ శతాబ్దంలో కొనసాగడానికి నేపాల్‌ పాలకుల వైఫల్యమై కారణమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘బ్రిటీష్‌ ఇండియాతో జరిగిన యుద్ధంలో నేపాల్‌ ఓడిపోయిన కారణంగా ఈ ఒప్పందం కుదిరింది. దాదాపు మూడు వంతుల భూభాగాన్ని మేం కోల్పోయాం. అయితే ఇప్పుడు ఆ ఒప్పందంలో పేర్కొన్న సరిహద్దుల గురించే మేం మాట్లాడుతున్నాం. ఇక దీనిని అనుసరించే 1981 నుంచి ఇరు దేశాలు అంతర్జాతీయ సరిహద్దుల మ్యాపింగ్‌పై సర్వేలు చేపట్టాయి. కాబట్టి ప్రస్తుతం మా భూభాగంలో భారత్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకించేందుకు ఈ ఒప్పందమే మాకు అవకాశం కల్పించింది. లిపులేఖ్‌, లింపియధుర, కాలాపానీ కొత్త మ్యాపులను దీని ఆధారంగానే రూపొందించాం’. ఆ విషయాన్ని నిరూపించగలం’’ అని పేర్కొన్నారు. (కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్‌?!)

మేం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం
అదే విధంగా చైనా- భారత్‌ సరిహద్దుల్లో ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో నేపాల్‌ దూకుడు పెంచడాన్ని ఎలా భావించవచ్చు అని అడుగగా.. నేపాల్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని.. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా లిపులేఖ్‌లో భారత్‌ చేపట్టిన నిర్మాణంపై అభ్యంతరం తెలిపిన నేపాల్‌... కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను తమ భూభాగాలుగా పేర్కొంటూ పటాలు విడుదల చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.(అవసరమైతే యుద్ధానికి సిద్ధం.. కానీ: నేపాల్‌ మంత్రి)

కాగా బ్రిటీష్‌ ఇండియా- నేపాల్‌ మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు