‘కరోనా’పై ప్రాంక్‌.. ఐదేళ్లు జైలు శిక్ష

12 Feb, 2020 13:54 IST|Sakshi

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై  ప్రాంక్‌ వీడియో చేసి ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. సరదా కోసం చేసిన పనికి ఐదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ ఘటన రష్యాలోని మాస్కో అండర్‌గ్రౌండ్ మెట్రో రైలులో ఈ నెల 8న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  తజకిస్తాన్‌కు చెందిన కరోమాత్ ఝబరావ్ అనే ఓ యువకుడు, అతడి స్నేహితులు ఈ నెల(ఫిబ్రవరి) 2న మాస్కో రైల్లో ఒక ప్రాంక్ వీడియో తీయాలని అనుకున్నారు. ఈ సందర్భంగా కరోమాత్ కరోనా వైరస్ సోకినట్లుగా రైల్లో కిందపడిపోయి భయపెడతానని తెలిపాడు.

(చదవండి : ఇకపై కరోనా అని పిలవకూడదు..!)

చెప్పినట్లే మాస్క్ ధరించి రైలు ఎక్కిన కరోమాత్ కొద్ది సేపటికి కిందపడి గిల గిల కొట్టుకున్నాడు. వెంటనే అతని స్నేహితులు వచ్చి కరోనా వైరస్‌ సోకిందంటూ పరుగులు తీశారు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు అతడి నుంచి దూరంగా పరిగెట్టారు. కొద్దిసేపటి తర్వాత కరోమాత్ తనకు వైరస్ లేదని, భయపడొద్దని ప్రయాణికులకు తెలిపాడు. ఈ వీడియోను కరోమత్ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన పోలీసులు ఈ నెల 8న కరోమత్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. మెట్రో రైలులో ప్రయాణికులకు భయాందోళనలు కలిగించినందుకు కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే సోషల్‌ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించాలని ఆదేశించింది. 

ఈ ఘటనపై యువకుడి తరపు లాయర్‌ మాట్లాడుతూ.. ఆ ప్రాంక్ వీడియో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని అతడు భావించలేదని తెలిపారు. అతడు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశాడని, కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్కులు ధరించకపోతే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ప్రాంక్ చేశాడన్నారు.

మరిన్ని వార్తలు