కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే

6 Jan, 2020 17:01 IST|Sakshi

మృత్యువాత చెందుతున్న కోట్లాది జంతువులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

ట్రెండింగ్‌లో ‘ప్రే ఫర్‌ ఆస్ట్రేలియా’

అడవి తల్లినే నమ్ముకున్న మూగజీవాలు కీకారణ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. అప్పుడు అమెజాన్‌ అడవులు.. ఇప్పుడు ఆస్ట్రేలియా అడవులు.. అగ్నికి ఆహుతి అవుతూ మూగజీవాలను పొట్టనపెట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి బూడిదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవులను అంటుకున్న మంటలు దగ్గరిలోని పట్టణాలకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ విపత్తును ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు ‘అగ్ని’ పరీక్షగా మారింది. ఓవైపు  అధికారులు అడవుల్లో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుండగా, మిగతా దేశాలు అగ్నికి ఆహుతవుతున్న మూగజీవాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు 24మంది మరణించగా, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో అక్కడ నివసించే జనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8వేల కోలాలు(ఓ రకమైన జంతువు), 50 కోట్లకు పైగా జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఐదున్నర మిలియన్ల హెక్టార్లకు పైగా అడవి బుగ్గయ్యింది. అక్కడి అగ్నిమాపక సిబ్బంది రాత్రనక, పగలనక సహాయక చర్యలు చేపడుతున్నా విధ్వంసాన్ని నియంత్రించలేకపోతున్నారు. కళ్లముందే సజీవదహనమవుతున్న జంతువులను చూసి కన్నీళ్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే


దట్టమైన అడవుల్లో తప్పించుకునే దారి తెలీక మంటల్లో చిక్కుకుని గాయపడిన జంతువులను అగ్నిమాపక సిబ్బంది రక్షించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి. ‘ఆస్ట్రేలియా కోసం ప్రార్థించండి’ అని నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. ‘మానవమాత్రులకు లొంగని అగ్నికీలలను భగ్నం చేయడానికి ‘వర్షం’ కురవాలని ప్రార్థిద్దాం’ అంటూ గొంతు కలుపుతున్నారు. ‘అక్కడ మనుషులు మాత్రమే ప్రాణాపాయ స్థితిలో లేదు. వేలాది జంతువులు సహాయం కోసం మూగగా రోదిస్తున్నాయి. వాటిని కాపాడుకుందాం’ అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ట్విటర్‌లో #PrayForAustralia హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. చదవండి: ఆస్ట్రేలియాలో ఆరని కార్చిచ్చు

మరిన్ని వార్తలు